8న సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్‌జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ ప్రభావతి గురువారం తెలిపారు. నగరంలోని సిటీ క్లబ్ ఆవరణలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో 16 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండి 55 కేజీల బరువు కలిగిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. జిల్లా జట్ల ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు కడప జిల్లాలో జరగబోయే అంతర్ జిల్లాల పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తిగల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9949721949 నంబర్‌ను సంప్రదిం చాలని కోరారు.
గంజాయితో ఇద్దరి అరెస్ట్
నెల్లిమర్ల: గంజాయి లావాదేవీలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై బి.గణేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశాలోని రాయగడ నుంచి గంజాయిని నెల్లిమర్ల పట్టణంలోని చంపావతి నది తీరంలో థామస్ పేట గ్రౌండ్ వద్దకు తరలిస్తున్న వ్యక్తి, దానిని కొనుగోలు చేసిన వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నెల్లిమర్లకు చెందిన వ్యక్తి గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో వినియోగ దారులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారిద్దరి దగ్గర సుమారు ఒక కేజీ 160 గ్రాముల గంజాయిని సీజ్ చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని జమ్మిడివలస గ్రామానికి చెందిన కర్రి ప్రసాద్(39) రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి గురువారం మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరీక్ష నిమిత్తం విజయవాడ వెళ్లి తిరిగి స్వగ్రామానికి ట్రైన్‌లో వస్తుండగా మార్గమధ్యంలో అనకాపల్లి వద్ద ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడు ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి ..
రామభద్రపురం: మండలం పరిధిలోని తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీ కొని ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రామ్‌గోపాల్ గౌతం, సాన్వర్ ప్రసాద్ వర్మ స్నేహితులు. వారిద్దరూ కొన్ని నెలల క్రితం జీవనోపాధి కోసం సాలూరుకు వచ్చి కొత్తభవనాలకు పుట్టీలు, సీలింగ్‌లు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని సొతూరుకు వెళ్తానని బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో డ్రాప్ చేయమని రామ్‌గోపాల్‌ను ప్రసాద్ వర్మ కోరడంతో ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై బొబ్బిలి రైల్వేస్టేషన్‌కు బయల్దేరి వెళ్తున్నారు. సరిగ్గా తారాపురం టీకాల లచ్చన్న గుడి వద్దకు వచ్చేసరికి వారికంటే ముందుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న అనకాపల్లి జిల్లా రామవరం గ్రామానికి చెందిన రామదాసు సొంతూరుకు వెళుతూ గుడిలో అమ్మవారిని దర్శించుకుందామని బైక్ స్లో చేశాడు. ఇంతలో వెనకనుంచి వస్తున్న ఇద్దరు స్నేహితులు ముందున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్ వెనుక కూర్చున్న ప్రసాద్ వర్మ(42) ప్రమాదవశాత్తు తుళ్లిపోయి రోడ్డు దెబ్బతిన్నాడు. దీంతో తలకు తీవ్రగాయం కాగా, రామ్‌గోపాల్ గౌతమ్‌కు, రామదాసుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్సై వి.ప్రసాదరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రథమ చికిత్స నిమిత్తం గాయపడిన ముగ్గురిని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడికి చేరుకునే సరికి ప్రసాద్ వర్మ మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఎస్సై ప్రసాదరావు కేసే నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పోక్సో కేసు నమోదు
బొండపల్లి: మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలుడు మరో గ్రామానికి చెందిన బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధిత బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. బాలికతో పాటు బాలిక తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
8న సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
8న సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment