భూములు లాక్కుని కడుపు కొట్టొద్దు
● బైపాస్ నిర్వాసితుల సమావేశం ● భూమి ధర పెంచాలని రైతుల పట్టు
శృంగవరపుకోట: మాకు జీవనాధారమైన భూములు లాక్కుని కడుపు కొట్టకండి. అడిగిన ధర ఇవ్వకుండా మా భూములు లాక్కుంటే మేం ఏం కావాలి. ప్రభుత్వమే భూములు లాక్కుంటామంటే ఎవరికి చెప్పుకోవాలంటూ నిర్వాసిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ–బొడ్డవర జాతీయ రహదారి 516బి రహదారి విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా మండలంలోని కొత్తూరు నుంచి కాపుసోంపురం వరకు కొత్తగా నిర్మాణం చేయనున్న బైపాస్ రహదారి ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులతో ఆర్డీవో సూచనల మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ల్యాండ్ అక్విజిషన్ డీటీలు కె.హరికిరణ్, ఎస్.కోట ఇన్‌చార్జ్ తహసీల్దార్ కె.భరత్‌కుమార్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీటీ హరికిరణ్ మాట్లాడుతూ రైతుల నుంచి భూమిని ఐదు కేటగిరిలుగా తీసుకుంటామని, ఎస్‌ఆర్‌ఓ నిర్ధారించిన మార్కెట్‌ఽ ధర కన్నా రెండున్నర రెట్లు అధికంగా చెల్లిస్తామని చెప్పారు. ముందుగా అవార్డు ప్రకటించి, నగదు చెల్లించిన తర్వాత పనులు ప్రారంభిస్తారని రైతుల ప్రశ్నకు బదులు చెప్పారు. దీనిపై పలువురు రైతులు మాట్లాడుతూ ఐదు రెట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలు ఫిబ్రవరిలో పెంచిన భూముల ధరల ఆధారంగా పరిహారం చెల్లించాలని కోరారు. దీనిపై డీటీ హరికిరణ్ బదులిస్తూ నోటిఫికేషన్ ఇచ్చే తేదీ నాటికి ఉన్న మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తామని, గజాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఎస్‌ఆర్‌ఓ రికార్డుల్లో గజా ల్లో నమోదై ఉంటేనే గజాల్లో చెల్లింపులు చేస్తారని చెప్పారు. రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కులు ఉన్న వారికే చెల్లింపులు చేస్తారని చెప్పారు.
‘పరిహారం పెంపు అధికారం లేదు
మేము జిల్లా అధికారులం కాదు. ఏమీ చేయలేం. మీ వినతులు జిల్లా అధికారులకు వివరిస్తాం అంటూ అధికారులు రైతుల డిమాండ్లకు బదులిచ్చారు. దీంతో రైతులు మాట్లాడుతూ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు మాకు చెప్పి ఇచ్చారా? మా ఆస్తి తీసుకుని మా ఉపాధి లాక్కునేటప్పుడు మీ ప్రభుత్వాలు నిర్ణయించిన మార్కెట్ ధర అడిగితే ఇవ్వరా? ఇదెక్కడి న్యాయం, మా కుటుంబాలు ఏం కావాలి అంటూ భోరుమన్నారు. కొందరు రైతులు అధికారులకు దండాలు పెట్టి మాకు న్యాయం చేయండి, మా కడుపులు కొట్టకండి అంటూ మొరపెట్టుకున్నారు. రైతులు తమ అంగీకారం చెప్పకపోవడంతో అసంపూర్తిగానే సమావేశం అయ్యిందని పించారు. సమావేశంలో పలువురు రైతులు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
భూములు లాక్కుని కడుపు కొట్టొద్దు
Comments
Please login to add a commentAdd a comment