భువనేశ్వర్ : ఏప్రిల్ 1 నుంచి 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 2న అన్ని పాఠశాలల్లో కొత్త విద్యా విధానం (ఎన్‌ఈపీ) రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం చేపడుతోంది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ప్రవేశ ఉత్సవ్, అక్షరాభ్యాసం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద గోండ్ తెలిపారు. ఈ ప్రచారంలో తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పుర ప్రముఖులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 3 నుంచి 5 వరకు పాఠశాల స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొంటారు. ఈ మేరకు రాష్ట్ర పాఠశాలలు మరియు సామూహిక విద్యా శాఖ కమిషనర్ కమ్ కార్యదర్శి షాలిని పండిట్ అన్ని జిల్లా కలెక్టర్లు మరియు మేజిస్ట్రేట్‌లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శిశు వాటిక మరియు ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో ఆహ్వాన పత్రాలు పిల్లల కుటుంబాలకు పంపిణీ చేస్తారు. ప్రవేశ ఉత్సవ్‌ను విజయవంతంగా జరుపుకోవడానికి, ప్రతి ప్రాథమిక పాఠశాల పరివాహక ప్రాంతంలోని శిశు వాటిక, 1వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులను జాబితా చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరింది. జిల్లా యంత్రాంగం గుర్తించిన విద్యార్థుల సంఖ్య ప్రకారం ఆహ్వాన పత్రాలు ముద్రించి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు. జిల్లా యంత్రాంగం మండల, జిల్లా విద్యాధికారులు మరియు ఇతర వాటాదారులతో సమన్వయం చేసుకుని మండల, జిల్లా స్థాయిలో ఏప్రిల్ 2, 2025న అన్ని పాఠశాలల్లో ప్రవేశ ఉత్సవ్, అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకునేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రముఖులను అతిథులుగా ఆహ్వానిస్తారు. ఈ ఏడాది జనవరి నెల నుండి రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 అమలును పాఠశాల, సామూహిక విద్యా శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చొరవలో భాగంగా జాతీయ పాఠ్య ప్రణాళిక విధానం (ఎన్సీఎఫ్) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర పాఠ్య ప్రణాళిక విధానం అమలు చేయనున్నట్లు విభాగం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment