ఆరో రోజు ఒకరు డిబార్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షల్లో భాగంగా 6వ రోజు శుక్రవారం సెకండియర్ విద్యార్థులు సెట్–2 ప్రశ్న పత్రంతో మాథ్స్ 2ఎ, బోటనీ, సివిక్స్ పేపర్–2, ఇతర ఒకేషనల్ పేపర్లకు పరీక్ష రాశారు. జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లో కలిపి 18763 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 385 మంది గైర్హాజరయ్యారు. 6వ రోజు జిల్లాలో ఒక మాల్‌ప్రాక్టీసు కేసు నమోదైంది. పొందూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకెండియర్ మాథ్స్ 2ఏ పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థి మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతూ పట్టుబడటంతో అధికారులు డీబార్ చేశారు.
రెండు టన్నుల చింతపండు పట్టివేత
సారవకోట: మండలంలోని వడ్డినవలస గ్రామ సమీపంలో శుక్రవారం ఒడిశా రాష్ట్రం గుణుపురం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకొస్తున్న చింతపండు వ్యాన్‌ను అటవీ శాఖ ఎస్‌ఎఫ్‌ఓ ఈశ్వరరావు పట్టుకున్నారు. సుమారు 2 టన్నుల చింతపండును గుణుపురం నుంచి నరసన్నపేటకు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకపోవడంతో వ్యాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.నరసన్నపేటకు చెందిన ఒక వ్యాపారి నిత్యం ఇదే మార్గంలో ఒడిశా నుంచి చింతపండు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
తెరుచుకోని గ్యాస్ గోదాం
పొందూరు రూరల్: పొందూరులో గ్యాస్ ఇబ్బందులు తప్పడం లేదు. గత వారం రోజులుగా గ్యాస్ లభించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుక్ చేసినప్పటికీ ఇవ్వటం లేదు. గోదాం దగ్గరకు వచ్చి తీసుకుందామంటే తాళాలు వేసి ఉంటున్నాయి. గ్యాస్ గోదాం దగ్గరకు వచ్చిన లబ్ధిదారులు తమ గోడును వినిపించుకుంటున్నారు. శుక్రవారం రాపాక, పిల్లలవలస, ఎరుకులపేట, పొందూరుకు చెందిన పలువురు లబ్ధిదారులు గ్యాస్ గోడౌన్‌కు వచ్చి ఉసూరుమని తిరిగి వెనుకకు ఖాళీ సిలిండర్లతో వెళ్లిపోయారు.
దుర్గమ్మ ఆలయంలో చోరీ
వజ్రపుకొత్తూరు: మండలంలోని సుంకర జగన్నాథపురం దుర్గమ్మ తల్లి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. తాళాలు పగలుగొట్టి వెండి, బంగారం నగలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం దాసురాలమ్మ గాడి హైమావతి ఆలయం వద్దకు రాగా.. తాళం పగలుగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఆభరణలు మాయం కావడంతో వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారమిచ్చారు. చోరీలో రెండు కిలోల బరువు కలిగిన వెండి పల్లెం, అమ్మవారి విగ్రహం, కిరీటం, బల్లెం, గ్లాసు, రెండు తులాల బంగారం శతమానాలు, ముక్కు పుడకలు, కాసులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పూండి – నౌపడ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న దేవాలయం కావడంతో దొంగలు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డయాలసిస్ బెడ్లు పెంచాలి
కవిటి: కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డయాలసిస్ బెడ్ల సంఖ్య పెంచాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేత పిరియా సాయిరాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం కవిటిలో మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా కవిటి మండలంతో పాటు చాలా కేంద్రాల్లో డయాలసిస్ కోసం వేచి చూసే రోగులసంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో డయాలసిస్ బెడ్ల సంఖ్య పెంపు దిశగా ఆలోచన చేయాలని కోరారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పింఛన్లను రూ.10వేలకు పెంచాలని గుర్తు చేశారు. కవిటిలో పదిలోపు ఉన్న బెడ్‌ల సంఖ్యను 19కు పెంచిన విషయాన్ని తెలిపారు. ఇచ్ఛాపురంలో డయాలసిస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారని, దాన్ని ప్రారంభించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు కడియాల ప్రకాష్, జల్లు యుగంధర్ పాల్గొన్నారు.
ఆరో రోజు ఒకరు డిబార్
ఆరో రోజు ఒకరు డిబార్
Comments
Please login to add a commentAdd a comment