ప్రజా సమస్యల పరిష్కార కోసమే చైతన్యయాత్రలు
విజయనగరం గంటస్తంభం: సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాచైతన్య యాత్రల్లో ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి పోరాటాలు చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కరప్రత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సైకిల్‌యాత్రగా విజయనగరం నుంచి బయలుదేరి మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మండలాలు, పట్టణ ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడిచినా ఉపాధి కల్పనపై చిత్తశుద్ధి లేదని, ధరలు అదుపులో ఉండడం లేదన్నారు. మరోవైపు కరెంట్ చార్జీల భారం విపరీతంగా ప్రజలపై వేస్తున్నారని విమర్శించారు. సూపర్‌సిక్స్ గురించి గొప్పగా చెప్పడం తప్ప ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా, సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారన్నారు. విజయనగరం జిల్లాలో కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వేసవి తీవ్రత పెరగకుండానే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రజలను చైతన్య పరుస్తూ తమయాత్రలు 17 వ తేదీ వరకు జరుగుతాయని తెలియజేశారు. ప్రజలంతా తమ సమస్యలను సీపీఎం దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఈనెల 22 నుంచి 28 వరకు వివిధ రూపాల్లో ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్, మే నెలల్లో సమరశీల పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ
Comments
Please login to add a commentAdd a comment