
బాల్య వివాహాలకు అడ్డుకట్ట
రాయగడ: బాల్య వివాహం చేసేందుకు తన 15వ ఏటే తల్లిదండ్రులు సన్నద్ధమయ్యారు. అందుకు వరుడిని కూడా సిద్ధం చేశారు. పెళ్లికి అన్ని సమకూర్చారు. అయితే అందుకు ససేమిరా అంది. తల్లిదండ్రుల ఆలోచనను మార్చేసింది. బాల్యవివాహాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమని వివరించింది. అయినా అంగీకరించని తన తల్లిదండ్రుల వైఖరిని అడ్డుకుంది. చివరకు బాల్యవివాహాన్ని తిరస్కరించింది లిల్లి కొండగిరి. అక్కడితో తన పని పూర్తయ్యిందని ఊపరిపీల్చుకొలేదు. తనలాగే పరిసర గ్రామాల్లో జరగుతున్న బాల్యవివాహాలను అడ్డుకుంది. వారికి నచ్చజెప్పింది. ఇలా సుమారు పది బాల్యవివాహాలను అడ్డుకున్న లిల్లీ అందరికీ ఆదర్శనీయురాలిగా మారింది. జిల్లాలోని రామనగుడ సమితి కొరడ గ్రామానికి చెందిన లిల్లిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో శునివారం జరిగిన కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం లిల్లీని ఘనంగా సత్కరించారు. చిన్న వయసులోనే బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అడ్డుగోడగా నిలిచిన ఆమె అందరికీ ఆదర్శనీయులని జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహారో ప్రశంసించారు. బాల్యవివాహాల నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చైతన్య కార్యక్రమాలకు ఆమె వారధిగా నిలవడం శుభపరిణామమన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం మహిళల మధ్య నిర్వహించిన వివిధ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సామాజిక, సంక్షేమ శాఖ అధికారి మీనతీ దేవ్, సీడీపీవో మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శంగా నిలిచిన లిల్లీ
Comments
Please login to add a commentAdd a comment