హాస్టల్ నిర్వాహకులపై చర్యకు డిమాండ్
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలోని అన్వేష హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసేందుకు ఆదివారం సాయంత్రం వెళ్లిన జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమా రావ్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు ఘెరావ్ చేశారు. హాస్టల్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుదూర గ్రామాల నుంచి తమ పిల్లలను చదువుకునేందుకు హాస్టల్‌కు పంపిస్తున్నామని అయితే ఇటువంటి తరహా ఘటనలు చోటు చేసుకుంటే తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక విద్యార్థిపై ఇంతమంది మూకుమ్మడిగా దాడి చేస్తుంటే హాస్టల్ సూపరింటెండెంట్, వార్డన్ చొద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన విద్యార్థులను వేరే చోటకు తరలించాలని, సూపరింటెండెంట్, వార్డన్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు తమ పిల్లలను హాస్టల్‌కు పంపేది లేదని, అవసరమైతే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. దీనికి విచారణాధికారి మాట్లాడుతూ.. నిజానిజాలు తెలుసుకున్న అనంతరం పూర్తి వివరాలతో నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి బాధ్యులపై తగు చర్యలు తీసుకునేలా తనవంతు సహకరిస్తానని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రావ్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment