3,738 మంది చొరబాటుదారులను గుర్తించాం: ముఖ్యమంత్రి
భువనేశ్వర్ : రాష్ట్ర వ్యాప్తంగా 3,738 మంది బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించామని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సోమవారం రాష్ట్ర శాసన సభలో తెలిపారు. వారిని బహిష్కరించే విషయం పరిశీలనలో ఉందన్నారు. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ చొరబాటుదారులను గుర్తించి వారిని బహిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలుసుకోవాలనుకున్న బీజేపీ ఎమ్మెల్యే మానస్ కుమార్ దత్తా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి ఈ సమాధానం ఇచ్చారు. మానస్ కుమార్ దత్తా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో నివసిస్తున్న 3,738 మంది బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించిందని అనుబంధ గణాంకాలు ప్రవేశ పెట్టారు. బంగ్లాదేశీయ చొరబాటుదారులు అత్యధికంగా నాలుగు జిల్లాల్లో ఉన్నారు. ఈ జాబితా ప్రకారం కేంద్రాపడాలో అత్యధికంగా 1,649 మంది, జగత్సింగ్‌పూర్ ప్రాంతంలో 1,112 మంది, మల్కన్‌గిరిలో 655, మరియు నవరంగపూర్ ప్రాంతంలో 106 మంది ఉంటున్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో వివిధ క్రిమినల్ కేసుల్లో 41 మంది బంగ్లాదేశ్ జాతీయులు ఉన్నట్లు తేలిందని ముఖ్యమంత్రి తన సమాధానంలో సభకు తెలియజేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు (ఎస్పీలు) తమ తమ అధికార పరిధిలోని బంగ్లాదేశ్ చొరబాటుదారులను గుర్తించాలని ఆదేశించారు.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
హిరమండలం: బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన భార్య, సమయానికి రాకపోవడంతో మండలంలో ధనుపురం గ్రామ సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేసుకొని గొర్లె కన్నారావు (34) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పొందూరుకు చెందిన కన్నారావు దంపతులు ఊరూరా గాడిద పాలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు. ధనుపురం స్పైసీ దాబా సమీపంలోని ఖాళీ గదుల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్నిరోజులుగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అతడి భార్య ఆమె చెల్లెలు ఉన్న కవిటి గ్రామానికి వెళ్లింది. ఆదివారం తిరిగి వస్తానని చెప్పి రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కన్నారావు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తల్లి జి.సీతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎండీ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. మృతుడికి భార్య, ఎనిమిదేళ్ల పాప, ఆరేళ్ల బాబు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment