కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
పర్లాకిమిడి: గత ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, గ్యాంగ్ రేప్‌లు, రెసిడెన్సియల్ పాఠశాలల్లో విద్యార్థినులపై అఘాయిత్యాలు జరుపుతున్నా సీఎం మోహన్ చరణ్ మఝి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మోహన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు దాశరథి గోమాంగో ఆరోపించారు. మహిళపై నేరాలు చేస్తున్న వారిపై పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక కాంగ్రెస్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకూ కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ రాష్ట్ర అబ్జర్వర్ దుర్గా పండా, మానస చౌదురి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బసంత పండా, మోహన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతినిధి కున్నా మఝి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశాయి. గత ఎనిమిది మాసాలుగా 1600 మంది ఎస్సీ, ఎస్టీ, దళిత నారీమణులపై నేరాలు జరుగుతున్నా రాష్ట్ర హోం శాఖ పట్టించుకోవడం లేదని, అలాగే గజపతి జిల్లాలో పర్లాకిమిడి అన్వేషా ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్‌లో గిరిజన విద్యార్థిని వేధించిన సూపరింటెండెంట్‌ను బదిలీ చేశారని కానీ అరెస్టు చేయలేదని మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ఆరోపించారు. ఢెంకనాల్‌లో ఏడుగురు ఒక వివాహితపై గ్యాంగ్ రేప్ చేశారని, బర్‌ఘడ్‌లో ధనుయాత్రలో ఒక అమ్మాయిపై నాలుగురోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారని అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశంపై విపక్ష కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తనున్నారని ఎమ్మెల్యే దాశరథి గోమాంగో అన్నారు. అనంతరం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్‌కు గవర్నర్‌కు అడ్రస్ చేస్తూ రాసిన వినతిని అందజేశారు. కాంగ్రెస్ ర్యాలీలో మోహన, నువాగడ, ఆర్.ఉదయగిరి, రాయఘడ, మహేంద్రగడ, గుమ్మా నుంచి అధిక కాంగ్రెస్ మహిళా శ్రేణులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment