9 నెలల్లో రూ.21,000 కోట్ల రుణం
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వ రుణభారం 9 నెలల స్వల్ప వ్యవధిలో రూ.21,000 కోట్ల పైబడిందని సీఎం మోహన్‌చరణ్ మాఝి రాష్ట్ర శాసనసభకు తెలియజేశారు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.21,177.99 కోట్లు అప్పుగా తీసుకుందన్నారు. ఈ నిధులను మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమ పథకాల అమలు, కార్యాచరణ కోసం వినియోగించినట్లు పేర్కొన్నారు. బహుళ వనరుల నుంచి ఈ అప్పు తీసుకున్నట్లు ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం వెల్లడించారు. విపక్ష బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే గౌతమ్ బుద్ధ దాస్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాలు వెల్లడించారు.
రూ.9,000 కోట్ల ఓపెన్ మార్కెట్ రుణాలు
అత్యధికంగా రూ.9,000 కోట్లు ఓపెన్ మార్కెట్ రుణాలు తీసుకున్నట్లు సీఎం మోహన్‌చరణ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.7,149.56 కోట్ల రుణం లభించిందన్నారు. ఒడిశా మినరల్ బేరింగ్ ఏరియాస్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.2,750 కోట్లు, రాష్ట్ర పరిహార అటవీకరణ నిధి (క్యాంపా) నుంచి రూ.2,370 కోట్లు, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి జాతీయ బ్యాంకు (నాబార్డ్) నుంచి రూ.2,261.16 కోట్లు, నికర ప్రావిడెంట్ ఫండ్ తగ్గింపుల నుంచి రూ.2,352.73 కోట్లు అప్పుగా సేకరించామన్నారు. ఈ రుణాలను నీటి పారుదల, విద్యుత్, రోడ్లు, విపత్తు నిర్వహణ, పట్టణ మౌలిక సదుపాయాల వంటి మూలధన – ఇంటెన్సివ్ రంగాలకు కేటాయించినట్లు విశ్లేషించారు.
రుణాలు చెల్లించే ప్రయత్నాలు
ప్రజాహిత, పురోగతి లక్ష్యంగా ఆర్థిక వనరులను అప్పుగా సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం పాత అప్పులు తీర్చే దిశలో నిర్మాణాత్మక శైలితో ముందుకు సాగుతోందన్నారు. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రం మునుపటి రుణాలను రూ.14,970.97 కోట్లు తిరిగి చెల్లించిందని తెలిపారు. కొత్త రుణాలను ప్రభుత్వ పథకాల నిర్వహణ కోసం వినియోగిస్తూ.. మరోవైపు రాష్ట్ర ఆదాయంతో పాత అప్పులను తీర్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
సీఎం మోహన్‌చరణ్ మాఝీ
Comments
Please login to add a commentAdd a comment