ఎత్తిపోతల పథకం సామగ్రి చోరీ
ఆమదాలవలస రూరల్: రైతులకు సాగునీరందించేందుకు ఆమదాలవలస మండలం అక్కులుపేటలో బొడ్డేపల్లి రాజుగోపాలరావు వంశధార కుడిప్రధాన కాలువ 20ఎల్ ఎత్తిపోతల పథకం వద్ద చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి కరెంట్ సరఫరా నిలుపుదల చేసి మూడు ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి కాయిల్స్, కరెంట్ ఆయిల్ పట్టుకుపోయారు. పాటు అందులో ఉండే కరెంట్ ఆయిల్ అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న రైతులు, శ్రీనివాసచార్యులుపేట సర్పంచ్ గౌరిపతి ఆమదాలవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఎస్ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ కమిటీ ఏర్పాటు
శ్రీకాకుళం కల్చరల్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం కోసం జిల్లా, డివిజన్ కన్వీనర్లను నియమిస్తున్నట్లు ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ మంగళవారం ప్రకటించారు. జిల్లా కన్వీనర్‌గా విద్యావేత్త బుడుమూరు సూర్యారావును నియమించారు. ఈయన ప్రస్తుతం బూర్జ మండల ఉపాధ్యక్షునిగా ఉన్నారు. గ్రంథాలయ వ్యవస్థ పట్ల అభిమానం ఉన్నవారినే ఉద్యమ కమిటీలో ఏర్పాటు చేస్తున్నామని, వారి రాజకీయ కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని శివప్రసాద్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ కన్వీనర్‌గా విద్యావేత్త డాక్టర్ జామి భీమశంకర్, టెక్కలి డివిజన్ కన్వీనర్‌గా బెండి నర్సింగరావు, పలాస డివిజన్ కన్వీనర్‌గా చాపర వేణుగోపాల్‌ను నియమించారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కె.శ్రీనివాస్, న్యాయవాది బొడ్డేపల్లి మోహన్‌రావు, విశ్రాంత లైబ్రేరియన్ డి.గోపాలరావు, అరసం జిల్లా కార్యదర్శి చింతాడ కృష్ణారావు, విద్యావేత్త శాసనపురి మధుబాబు, ఇస్కఫ్ జిల్లా అధ్యక్షులు ఎం.వి.మల్లేశ్వరరావులను సభ్యులుగా ఎంపికచేశారు. ఈ నియామకాలపై రచయిత అట్టాడ అప్పలనాయుడు, అరసం జిల్లా అధ్యక్షులు నల్లి ధర్మారావు, కథానిలయం ప్రతినిధి దాసరి రామచంద్రరావు, శ్రీకాకుళ సాహితీ ప్రతినిధులు, కవులు కంచరాన భుజంగరావు, కలమట దాసుబాబు తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.
పరిశ్రమ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం
రణస్థలం: మండలంలోని పైడిభీమవరం పారిశ్రామికవాడలో సరాకా లేబొరేటరీ పరిశ్రమ వ్యర్థ జలాలు బయటకు విడిచిపెట్టి భూగర్భ జలాలు కలుషితం చేస్తున్నారంటూ నారువ పంచాయతీ ప్రజలు మంగళవారం ఫ్యాక్టరీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గతంలో పైపులైన్లు ద్వారా సముద్రంలో విడిచిపెట్టేవారని, కొన్నాళ్లుగా పరిశ్రమ పక్కనే గెడ్డ, కొండదిబ్బ దిగువ ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారని చెప్పారు. వ్యర్థ జలాల కారణంగా ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికై నా వ్యర్థాలు పారబోయడం ఆపకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో నారువ, అక్కయ్యపాలెం, బోయపాలెం తదితర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ప్రకృతి సాగుకు ప్రాధాన్యం
ఎచ్చెర్ల క్యాంపస్: వచ్చే ఖరీఫ్‌లో జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పి.రేవతి తెలిపారు. ఎచ్చెర్లలోని సాంకేతిక శిక్షణ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు రిసోర్సుపర్సన్లకు మూడు రోజుల శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 70వేల మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ సాగుపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పురుగుల మందులు, రసాయన ఎరువుల రహిత వ్యవసాయం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు, నిపుణులు ఆన్‌లైన్‌లో పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ధనుంజయరావు, సిబ్బంది సూర్యనారాయణ, పీఎస్ బాబు పాల్గొన్నారు.
ఎత్తిపోతల పథకం సామగ్రి చోరీ
ఎత్తిపోతల పథకం సామగ్రి చోరీ
ఎత్తిపోతల పథకం సామగ్రి చోరీ
Comments
Please login to add a commentAdd a comment