కేరాఫ్ దివ్యాంగులు
సహజ రంగులు..
● పూలతో పర్యావరణ హితమైన రంగుల తయారీ ● అబ్బురపరుస్తున్న మనోవికాస కేంద్రం దివ్యాంగులు ● 14న హోలీ వేడుకలకు రంగులు సిద్ధం
శ్రీకాకుళం కల్చరల్ : రంగుల కేళీ హోలీ పండుగ సమీపిస్తోంది. ఈ నెల 14న జరిగే ఆనందాల వేడుకకు ఇప్పటికే తాత్కాలిక రంగుల దుకాణాలు సిద్ధమయ్యాయి. అయితే రసాయనాలతో తయారుచేసే కృత్రిమ రంగులు కాకుండా పర్యావరణ హితమైన రంగులు వాడాలని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో విజ్ఞప్తులు చేస్తున్నా అలాంటి రంగులు ఎలా తయారవుతాయో..అవి ఎక్కడ దొరుకుతాయో చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో రసాయనాలు లేని రంగులు తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు జిల్లా కేంద్రంలో ఉంటున్న బెహరా మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులు. అందమైన, పర్యావరణానికి హాని చేయనటువంటి రంగులను స్వహస్తాలతో తయారు చేస్తున్నారు.
పూలరెక్కలతో..
హోలీ రంగులు పర్యావరణానికి హాని చేయకుండా ఉండడానికి రసాయనాలు లేకుండా కేవలం పూల రెక్కలతోనే ఇక్కడ సహజ సిద్ధమైన రంగులు తయారు చేస్తున్నారు. 74మంది మానసిక దివ్యాంగులు ఈ రంగుల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. ముందుగా వివిధ రకాల పూల రెక్కలను ఆరబెడతారు. అవి పూర్తిగా ఆరాక రంగుల వారీగా విడదీసి యంత్రంలో వేసి పౌడర్‌గా చేస్తున్నారు. వాటిని చిన్నచిన్న ప్యాకెట్లలో కట్టి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. కేంద్రంలో మానసిక దివ్యాంగులు తయారు చేసిన సహజ సిద్ధమైన రంగులు, ఇతర ఉత్పత్తులతో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేశారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా మానసిక దివ్యాంగులను ప్రోత్సహించిన వారవుతారు.
దివ్యాంగులకు ప్రోత్సాహం
దివ్యాంగుల సృజనకు మా వంతు ప్రోత్సాహం ఇస్తున్నాం. పూలతో సహజ సిద్ధంగా తయారు చేసిన ఈ రంగులు ప్యాకెట్ రూ.30 నుంచి మొదలుకుని సెట్ రూ.150 వరకు విక్రయిస్తున్నాం. దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ఎవరైనా కొనుగోలు చేయాలంటే కేంద్రంలో సంప్రదించవచ్చు.
– శ్యామల, బెహరా మనోవికాస కేంద్రం నిర్వాహకులు, పాత హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీకాకుళం
కేరాఫ్ దివ్యాంగులు
కేరాఫ్ దివ్యాంగులు
కేరాఫ్ దివ్యాంగులు
Comments
Please login to add a commentAdd a comment