శాసనసభలో క్రమశిక్షణ చర్యలు
భువనేశ్వర్: రాష్ట్ర శాసనసభలో క్రమశిక్షణ రాహిత్యంపై చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. మంగళవారం సభలో జరిగిన ఒక ఘటన తర్వాత 7 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభలో పట్టణాభివృద్ధి శాఖ ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో అధికార బీజేపీ ఎమ్మెల్యే జయ నారాయణ్ మిశ్రా, కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ మధ్య గొడవ చోటు చేసుకుంది. పరిస్థితి వేడెక్కడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేయిచేసేందుకు విఫలయత్నం చేసినట్లు ఆరోపణ. అయితే జయ నారాయణ మిశ్రా మొదట తన కాలర్ పట్టుకున్నట్లు తారా ప్రసాద్ ప్రత్యారోపణ చేశారు.
సభలో గందరగోళం
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం నుంచే ప్రతిపక్ష కాంగ్రెస్, బిజూ జనతా దళ్ ఎమ్మెల్యేలు సభ మధ్యలోకి వచ్చి గందరగోళం సృష్టించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహిళలపై హింసకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి స్పీకర్ పోడియం ఎక్కడానికి ప్రయత్నించారు. తారా ప్రసాద్ బాహిణీపతి, సాగర్ దాస్, రోమాంచ్ రంజన్ విశాల్, యోగేష్ సింగ్, దేవి రంజన్ త్రిపాఠి, మాధవ్ ధొడొ, నొబొ మల్లిక్, అభిమన్యు సెఠి, చక్రమణి కంవర్ అసెంబ్లీ రిపోర్ట్ టేబుల్‌పై నిలబడి నిరసన తెలిపారు.
గాంధీ విగ్రహం వద్ద నిరసన
సస్పెన్షన్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా రాత్రంతా శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టనున్నట్లు తారా ప్రసాద్ బాహిణీపతి ప్రకటించారు. జరిగిన ఘటనపై వాస్తవాలను పరిశీలించకుండా తనకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం అన్యాయమన్నారు. విపక్షంలో ఉంటూ ప్రభుత్వ విధానాల్లో తప్పిదాలను వేలెత్తి చూపుతున్నందున ఇటువంటి చర్యలు చేపట్టారని ఆరోపించారు. బీజేపీ సభ్యుడు జయ నారాయణ మిశ్రా కాలర్ పట్టుకుని విదిలించగా ఎమ్మెల్యే బాబూ సింగ్ తోసి వేశారు. ఈ విషయాన్ని స్పీకర్‌కు లిఖితపూర్వకంగా వివరించినా, ఏకపక్ష ధోరణితో తనకు వ్యతిరేకంగా మాత్రమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పబట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ సరోజ్ ప్రధాన్ ప్రతిపాదన మేరకు స్పీకర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి సస్పెండ్
Comments
Please login to add a commentAdd a comment