పునర్విభజనను వ్యతిరేకిద్దాం
భువనేశ్వర్: వివాదస్పదమైన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తున్న తమిళనాడులోని డీఎంకే పార్టీ నాయకులు రాష్ట్రంలోని విపక్ష నేతలను మంగళవారం కలిశారు. తమిళనాడు మంత్రి టి.ఆర్.బి.రాజా, ఎంపీ దయానిధి మారన్‌లతో కూడిన ఇద్దరు సభ్యుల డీఎంకే ప్రతినిధుల బృందం స్థానిక నవీన్ నివాస్‌లో ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్, ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివాదాస్పదమైన నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించారు. జనాభా ఆధారంగా మాత్రమే నియోజకవర్గాలను పునర్నిర్మించాలనే కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సంయుక్త క్రియా శీలక కమిటీ (జేఏసీ)లో చేరాలని కోరారు.
22న చైన్నెలో సమావేశం
పునర్విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాష్ట్రాలను ఏకం చేయడమే లక్ష్యంగా ఈనెల 22న చైన్నెలో జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరు కావాలని డీఎంకే ప్రతినిధుల బృందం ఆహ్వానించింది. బీజేడీ జేఏసీలో చేరుతుందని డీఎంకే నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పునర్విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టుకునేందుకు డీఎంకే ఎన్డీఏలోని పార్టీలతో సహా వివిధ పార్టీలను సంప్రదిస్తోందన్నారు. చైన్నెలో జరగబోయే సమావేశానికి హాజరు కావడానికి అధికారికంగా ఆహ్వానించడానికి సీఎం స్టాలిన్ తరపున ఇక్కడికి వచ్చినట్లు బృందం వివరించింది. పునర్విభజనతో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ మరియు ఒడిశాతో సహా పలు రాష్ట్రాలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అన్నారు.
బీజేడీ, కాంగ్రెసు నేతలకు డీఎంకే పిలుపు
Comments
Please login to add a commentAdd a comment