
పేరాపురంలో దొంగతనం
● నాలుగు తులాల బంగారు ఆభరణాలు,
రెండు లక్షల రూపాయల నగదు అపహరణ
పూసపాటిరేగ: మండలంలోని పేరాపురం గ్రామంలో దొంగతనం జరిగింది. బాధితులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గురుగుబిల్లి కసవయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 26న తిరుపతి వెళ్లాడు. దర్శనం అనంతరం 29వ తేదీ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇంటి తలుపు తెరిచి ఉండడంతో వెంటనే లోనికి వెళ్లి చూడగా బీరువాలోని నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రెండు లక్షల రూపాయల నగదు కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా.. ఎస్సై ఐ. దుర్గాప్రసాద్, తదితరులు ఆదివారం గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బీరువాను క్షుణ్ణంగా పరిశీలించి, తెలిసిన వారు దొంగతనం చేశారా.. బయట వ్యక్తులు వచ్చారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.