కొరాపుట్: వైద్యుడు దేవుడుతో సమానం అనే మాట నిరూపించాడు ఆ యువ డాక్టర్. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి ఓ మహిళను అత్యవసర చికిత్స కోసం బంధువులు శుక్రవారం తీసుకొచ్చారు. రోగిని పరిశీలించిన యువ డాక్టర్ సుమంత్ రంజన్ బాల్ ఆమెకి రక్తం ఎక్కించాల్సి ఉందని బంధువులకు వివిరించారు. అత్యవసర సమయంలో ఆమెకి రక్త లభించలేదని వారు చేతులెత్తేశారు. దాంతో ఆలోచించిన సుమంత్ తనది ఆమె గ్రూప్ కావడంతో రక్తదానం చేసి ప్రాణదానం చేశారు. డాక్టర్‌ను అక్కడ ఉన్నవారు అభినందించారు.
పాముకాటుతో ఏడేళ్ల బాలిక మృతి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర సమితి దిగాపూర్ పంచాయతీ ప్రధానిపుట్ గ్రామంలో దొయిమతి గుండి కుమార్తె చుమి (7) పాముకాటుకు గురై మృతి చెందిందని బొయిపరిగుడ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. దొయిమతి తన ముగ్గురు పిల్లలతో గురువారం ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా చుమి అరుస్తూ లేచింది. ఏదో కరిచిందని చెప్పగా.. ఇంటి వారంతా లేచి చూశారు. పాము కరిచి ఉంటుందని బాలికను వెంటనే బైక్‌పై జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకువచ్చారు. బాలికను పరీక్షించిన డాక్టర్ చుమి ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు బొయిపరిగుడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాహిత ఆత్మహత్య
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కలిమెల సమితి ఎంవీ 70 గ్రామానికి చెందిన ప్రసంజిత్ దత్తకు, బలిమెల పోలీసుస్టేషన్ పరిధి ఎంవీ 109 గ్రామానికి చెందిన రామకృష్ణ కబిరాజ్ కుమార్తె ప్రమీలతో గతేడాది వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో అత్తింటి వేధింపులు తాళలేక ప్రమీల పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా ఇటీవల మరలా తిరిగి ఆమె భర్త, కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. కాగా కొద్దిరోజుల్లోనే తన గదిలో ఉరివేసుకొని మృతి చెందింది. అయితే తన కుమార్తెను అత్తింటివారే హత్య చేశారని మృతురాలి తండ్రి ఆరోపించారు. ఘటనా స్థలానికి ఐఐసీ చంద్రకాంత్ తండి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కొరాపుట్ నుంచి సైంటిఫిక్ బృందం వచ్చాక మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉంది.
చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
రాయగడ: చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను జిల్లాలోని అంబొదల పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వారివద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, 50 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
అంబులెన్స్‌లో పేలిన
ఆక్సిజన్ సిలిండర్
భువనేశ్వర్: అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి బాలింత తీవ్రంగా గాయపడిన ఘటన బొలంగీర్ జిల్లా టిట్లాగడ్ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. పసికందుతో బాలింతని అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా ఆక్సిజన్ సిలిండర్ ఆకస్మికంగా పేలింది. ఈ పేలుడులో బాలింతకు గాయాలయ్యాయి. ఈమెతో పాటు మరో 2 మంది బంధువులు స్వల్పంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తు ప్రాణహాని సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధిత మహిళని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు.
యువ డాక్టర్ రక్తదానం
యువ డాక్టర్ రక్తదానం