
హామీలు అమలు చేయాలి
కొరాపుట్: ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని సీపీఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జయపూర్ పట్టణంలో జాతీయ రహదారి–26పై సోమవారం నిరసన తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇవ్వలేమని చేతులెత్తేయడం దారుణమన్నారు. నిత్యావసర సరుకుల ధర లు, గ్యాస్ ధరలు పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన జుదిష్ట రౌవులో, ప్రమెద్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
ఆటో..బైక్ ఢీ: నలుగురికి గాయాలు
రాయగడ: ఆటో బైకు ఢీకొన్న ఘటనలో నలుగురు గాయపడ్డారు. జిల్లాలోని కల్యాణసింగుపూర్ సమితి బుడాగుడ కూడలిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో నాగేశ్వర కంజిక, ఇలాయి కడ్రక,చందు కడ్రక, త్రినాథ కడ్రకలు గాయపడ్డారు. సొమవారం ఒకే బైకు పై వీరంతా కొరపా పంచాయతీలోని బలిపొదొరి వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఒక ఆటోను అదుపు తప్పి ఢీకొన్నారు. ఈ ఘటనలొ బైకు పై ప్రయాణించే వారంతా గాయాలపాలయ్యారు. స్థానికులు స్పందించి సమీప ఆస్పత్రికి తరలించారు.
భారీగా హిందూ ఏక్తా వాహిని ర్యాలీ
కొరాపుట్: హిందూ ఏక్తా వాహిని వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించింది. సోమవారం రాత్రి నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్డులో ఈ బల ప్రదర్శన జరిగింది. ఏటా ఒడియా నూతన సంవత్సరం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహిస్తారు. ఆంధ్ర ప్రదేశ్,ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా కళాకారులు ర్యాలీలో పాల్గొన్నారు. పలు చోట్ల ముస్లిం సంస్థల ప్రతి నిధులు హిందువులకు మిఠాయి తినిపించారు. బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ర్యాలీలో పాల్గొన్నారు.
బీజేడీ శ్రేణుల నిరసన
రాయగడ: స్థానిక కపిలాస్ కూడలి వద్ద బీజేడీ శ్రేణులు సోమవారం నిరసన చేపట్టాయి. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, బీజేడీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెక్కంటి మాట్లాడుతూ.. ఒడిశా ప్రజలు దివంగత బిజూ పట్నాయక్‌ను వరపుత్రునిగా ఆరాధిస్తుండేవారు. కానీ బీజేపీ ప్రభుత్వం అటువంటి మహానాయకుడిని అవమానించడం సరికాదన్నారు.ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పాట్నాఘడ్‌లో బిజూ పట్నాయక్ విగ్రహాన్ని తగులబెట్టడం వంటి దుశ్చర్యకు పాల్పడడం దారుణమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు.

హామీలు అమలు చేయాలి

హామీలు అమలు చేయాలి

హామీలు అమలు చేయాలి