
‘ఆపరేషన్ కగార్ ఆపాల్సిందే’
పలాస: దండకారణ్యంలో ఆపరేషన్ కగార్‌ను కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిలుపుదల చేయాలని, కేంద్ర పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పలువురు వక్తలు ప్రభుత్వానికి విన్నవించారు. కాశీబుగ్గలోని ఓ రెసిడెన్సీలో గురువా రం సీపీఐ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ మాట్లాడుతూ దండకారణ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టుల పేరుతో ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయని, అమాయక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పోలీసుల చేతిలో మృతి చెందిన రేణుక బహుజనుల బిడ్డని, ఆమె ఎప్పుడు కూడా తుపాకీ పట్టిన దాఖలాలు లేవని, ఆమె ఒక రచయత, మేధావి అని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రకృతి వనరులను దోచుకోవడానికేనని దుయ్యబట్టారు. మానవ హక్కుల నేత ఎస్వీ కృష్ణ మాట్లాడుతూ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి మాత్రమే ఈ ఆపరేషన్ కగార్ అని వ్యతిరేకించారు. సదస్సులో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు కేవీ జగన్నాథం, సీపీఐ ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, పత్రి దానేసు తదితరులు పాల్గొన్నారు.