
554 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఒసారిగుడి అడవుల్లో పోలీసులు 554 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు ఒసారిగుడ అడవుల్లో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడులు చేపట్టారు. దీనిలో భాగంగా రవాణాకు సిద్ధంగా ఉండే గంజాయి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా గంజాయి రవాణా జరుగుతున్నట్లుగా అందిన సమాచారం మేరకు, పద్మపూర్ ఐఐసీ ధరణీధర్ ప్రధాన్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులను నిర్వహించారు. పోలీసుల రాకను గమనించిన గంజాయి రవాణాదారులు బస్తాలను వదిలి పరారయ్యారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
పూరీకి ఓఎస్‌ఆర్టీసీ
ప్రారంభం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ సమితి కేంద్రం నుంచి పూరీ దివ్యక్షేత్రానికి ఓఎస్‌ఆర్టీసీ జగన్నాథ ఓల్వో బస్సును బుధవారం ప్రారంభించారు. ఈ బస్సు సాయంత్రం 5 గంటలకు రాయిఘర్ నుంచి ప్రారంభమై పపడాహండి, భవానీపట్న, జునాఘడ్, బలిగుడ, భువనేశ్వర్ మీదుగా పూరి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం పూరీలో 5 గంటలకు బయల్దేదేరి ఉదయం 7 గంటలకు రాయిఘర్ చేరుతుంది. ఈ బస్సులో మహిళలకు 50 శాతం రాయితీ కల్పించనున్నారు.
గజపతి బీజేడీ అధ్యక్షుడిగా ప్రదీప్ నాయక్
పర్లాకిమిడి: విపక్ష బీజేడీ పార్టీ రాష్ట్రంలోని 19 జిల్లాలకు నూతన అధ్యక్షుల జాబితాను మంగళవారం రాత్రి ప్రకటించింది. వారిలో గజపతి జిల్లా బీజేడీ అధ్యక్షుడిగా ప్రదీప్ నాయక్ నియామకమయ్యారు. ప్రదీప్ నాయక్ అధ్యక్షుడిగా ఎంపికవ్వడం ఇది మూడోసారి. ఆయన నియామకంపై పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, మాజీ ఎమ్మెల్యే కెంగం సూర్యారావు, తిరుపతి పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, బీజేడీ యువజన అధ్యక్షుడు శాసనం లింగరాజు, ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంత పోరిచ్చా, పురపాలక సంఘ అధ్యక్షురాలు నిర్మలా శెఠి, గుసాని సమితి అధ్యక్షుడు ఎన్.వీర్రాజు, కాశీనగర్ ఎన్‌ఏసీ అధ్యక్షురాలు మేడిబోయిన సుధారాణి, కాశీనగర్ బీజేడీ నాయకుడు మధు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
వంటగ్యాస్ ధరలు
తగ్గించాలి
పర్లాకిమిడి: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కార్యదర్శి దండపాణి రైయితో స్థానిక మహారాజా బాలుర హైస్కూల్ కూడలి వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర వస్తువులపై భారం పడుతోందని, కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారుకు ఓటువేస్తే అనేక పన్నులు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన రూ.50 ఉపసంహరించుకోకుంటే ఆందోళన తప్పదని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం లిబరేషన్ నాయకులు శ్రీనివాస బెహరా, మోహిత్ మిశాల్, అల్యాన భాస్కరరావు, ఎ.శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

554 కిలోల గంజాయి స్వాధీనం

554 కిలోల గంజాయి స్వాధీనం