
బిజూ ఆరోగ్య సంక్షేమ కార్డులకు మంగళం..?
జయపురం: గత ప్రభుత్వం ప్రజలకు సమకూర్చిన బిజూ ఆరోగ్య పథకం కార్డులు విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రులు ఆమోదించడం లేదని కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొరాపుట్ జిల్లాలో ఆధునిక సౌకర్యాలు లేక ఈ జిల్లాకు చెందిన రోగులు మెరుగైన వైద్యం కోసం రాష్ట్రంలోని కటక్, లేదా బరంపురంతో పాటు విశాఖ వెళ్తుంటారు. ఎక్కువ మంది విశాఖ వెళ్తారు. గతంలో బిజూ ఆరోగ్య సంక్షేమ కార్డులపై విశాఖలో చికిత్స చేయించుకునే వాళ్లమని, కానీ ఆయుష్మాన్ భారత్ ప్రారంభమైన తేదీ నుంచి బిజూ కార్డులు అనుమతించడం లేదని తెలిపారు. చాలా మంది ఈ కార్డులు పట్టుకుని వైజాగ్ వెళ్లి చికిత్స చేయించుకోలేక ఆపసోపాలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయం బొయిపరిగుడలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఇప్పడు బిజూ పట్నాయిక్ ఆరోగ్య పథకం స్థానంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భవ కార్డులు, గోపబంధు జన ఆరోగ్య పథకాలు వచ్చాయని, పాత కార్డులు రద్దయ్యాయని తెలిపారు. పై రెండు పథకాలకు సాఫ్ట్‌వేర్ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక అమలులోకి వస్తాయని తెలిపారు. అయితే కొత్త కార్డులు వచ్చే వరకు పాత కార్డులపై చికిత్స పొందే అవకాశం కల్పించాలని బాధితులు కోరుతున్నారు.