
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 551.70 అడుగుల వద్ద ఉంది. ఇది 213.5390 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 10,350, ఎడమ కాలువకు 8,986, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 17,203, ఎస్‌ఎల్‌బీసీకి 2,200, వరద కాలువకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 39,059 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 4,553 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 825.60 అడుగుల వద్ద ఉంది. ఇది 45.3174 టీఎంసీలకు సమానం.
ఎన్నికల పరిశీలకులుగా కోన శశిధర్
బాపట్ల: ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా కోన శశిధర్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను కోన పరిశీలిస్తారు. ఎన్నికల నిర్వహణలో సమస్యలు ఉంటే 93919 23114 సెల్ నంబరుకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
యార్డులో 1,12,995 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,06,231 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,12,995 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ.21,800 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ.25,500 వరకు పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.12,500 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 80,610 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
త్రికోటేశ్వరుడికి బంగారు రుద్రాక్ష మాల
నరసరావుపేట రూరల్: కోటప్పకొండపై కొలువైన త్రికోటేశ్వరస్వామికి చిలకలూరిపేటకు చెందిన విడదల వేణుగోపినాథ్, స్పూర్తి దంపతులు రూ.4.40 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు రుద్రాక్షమాలను బహూకరించారు. ఆలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో స్వామి సన్నిధిలో బంగారు రుద్రాక్ష మాలను దాతలు ఆలయ ఈవో వేమూరి గోపికి అందజేశారు. బంగారు రుద్రాక్ష మాలతో స్వామి వారికి అభిషేకం నిర్వహించి దాతలకు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించారు. కార్యక్రమంలో అర్చక స్వాములు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏప్రిల్ 4న ‘కలెక్టర్ ట్రోఫీ’
పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా ఏర్పాటై ఏప్రిల్ 4వ తేదీకి సంవత్సరం కావస్తున్నందున అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, యువతను కలుపుకొని కలెక్టర్ ట్రోఫీ పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ తెలిపారు. శుక్రవారం పిడుగురాళ్ల పట్టణంలో ఓ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో రెవెన్యూ, సివిల్, వెల్ఫేర్, లా అండర్ ఆర్డర్ ప్రభుత్వ ఉద్యోగులను నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేసి ఈ ట్రోఫీని నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనిలో యువతను కూడా భాగస్వాములను చేసి వారిని కూడా మండలానికి ఒక జట్టును ఎంపిక చేసి పోటీలు నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కలెక్టర్ ట్రోఫీ క్రీడలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. మార్చి, ఏప్రిల్‌లో పరీక్షలు ఉంటాయి కాబట్టి మే నెలలో యువతకు పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తామని తెలియజేశారు.
