
సుమనోహర తీరప్రాంతం బాపట్ల జిల్లా సొంతం. అటవీ లావణ్యానికీ ఇక్కడ కొదవేమీ లేదు. తీరం వెంబడి ఇసుక నెలల్లో విస్తరించిన మడ, జామాయిల్, జీడిమామిడి వనాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. అరుదైన పక్షుల కిలకిలారావాలు పర్యాటకులను మైమరిపిస్తాయి. పచ్చని వనాల మధ్యలో నుంచి హొయలొలుకుతూ ప్రవహించే వంపుసొంపుల ఉప్పుటేరు భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. అందులో బోటు షికారు మరుపురాని మధురానుభూతిని మిగులుస్తుంది. అందుకే ఈ ప్రాంతానికి పర్యాటక సొబగులు అద్దేందుకు అటవీశాఖ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. మడ అడవుల విస్తరణకు చర్యలు చేపడుతోంది.
తనివితీరని
ప్రకృతి ఝరి పా‘వనమయ్యే’ :
అభివృద్ధి కానున్న ఉప్పుటేరు ప్రాంతం
బాపట్లటౌన్: జిల్లాలోని తీరప్రాంతం వెంబడి 9198.24 హెక్టార్లలో అటవీప్రాంతం ఉంది. ఇక్కడ మడ, జామాయిల్, సరుగుడు, జీడిమామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అరుదైన వృక్షజాతులకు మడ అడవులు ఆలవాలంగా ఉన్నాయి. వనమూలికలూ లభ్యమవుతాయి. సుమారు 1500 హెక్టార్లలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల అభివృద్ధికి ఇప్పటికే అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రూ.30 లక్షలతో మరో 100 హెక్టార్లలో మడ చెట్లు పెంచుతున్నారు. ఈ అడవుల మధ్యలో సూర్యలంక సముద్రతీరంలోని పొగురు నుంచి నిజాంపట్నం వరకు ఉప్పుటేరు వాగు ప్రవహిస్తోంది. ఈ ప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది.ఈ వాగులో బోటు షికారుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు.
అరుదైన జంతుజాలం
ఇక్కడి మడ అడవుల్లో అరుదైన జంతుజాలం ఉంది. ఫిషింగ్ క్యాట్స్, బావురుపిల్లి, మరక పిల్లి, నీటి పిల్లి, నీటి కుక్కలు, డాల్ఫిన్స్ వంటివి ఇక్కడ జీవిస్తాయని అటవీ అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు దేశ, విదేశాల నుంచి సీజనల్‌గా వచ్చే 120 రకాల పక్షులు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.
జీడిమామిడి, జామాయిల్‌తో ఆదాయం
ఈ ప్రాంతంలో 1,297 హెక్టార్లలో జామాయిల్ తోటలు విస్తరించి ఉన్నాయి. వీటిద్వారా ఆదాయం వస్తుంది. ఈ తోటలు ప్రస్తుతం కోతకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో అటవీశాఖాధికారులు తోటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. సుమారుగా రూ.80 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మొక్కల పెంపకానికి అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పర్యావరణాన్ని పెంచే మొక్కలు పెంచాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో 225 హెక్టార్లలో ఉన్న జీడిమామిడి తోటల ద్వారా ఏటా రూ.7లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది.

లక్ష్య‘మొక్క’టే: అడవులదీవిలో మడ మొక్కలకు నీరు పెట్టేందుకు కాలువలు తవ్వుతున్న దృశ్యం

Comments
Please login to add a commentAdd a comment