
అగ్గి బండి వచ్చేలోపు బుగ్గి!
● అమరావతిలో అగ్నిమాపక కేంద్రం లేక ఇబ్బందులు ● ఎటు చూసినా 30, 40 కి.మీల దూరంలో కేంద్రాలు.. అక్కడి నుంచి వచ్చేలోపు నష్టం జరుగుతున్న వైనం ● సొంత స్థలం ఉన్నా నిర్మాణానికి నోచుకోని వైనం
అమరావతి: ప్రసిద్ధ శైవక్షేత్రం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రమైన అమరావతి, పరిసర ప్రాంతాలలో జరిగే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు, ప్రమాదంలో బాధితుల ఆస్తులు రక్షించేందుకు అగ్నిమాపక కేంద్రం అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రానికి స్థల సేకరణ జరిగినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఫైర్‌స్టేషన్ దూరంగా ఉండటం వల్ల సకాలంలో ఫైరింజన్ రాక ప్రజల ఆస్తులు అగ్నికి ఆహూతవుతున్నాయి.
30 కి.మీ దూరం నుంచి వచ్చే లోపు..
మండలంలో ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా క్రోసూరు ఫైర్ స్టేషన్‌పై ఆధార పడాల్సి వస్తుంది. అమరావతికి 40కి.మీ దూరంలో మంగళగిరి, 30 కి.మీ దూరంలో క్రోసూరు, సత్తెనపల్లి అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. దీంతో సమాచారం అందుకుని ఫైరింజను వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. క్రోసూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలో సుమారుగా 120 నుంచి 150కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు 20కి పైగా అగ్నిప్రమాదాలు నమోదు అయినట్లు సమాచారం. ఇందులో ఎక్కువశాతం సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోలేకపోవటంతో ఆస్తులు బుగ్గిపాలు అయ్యాయి. ఈక్రమంలో ప్రమాదాల నివారణకు అమరావతి కేంద్రంగా మరో అగ్నిమాపక కేంద్ర ఏర్పాటు చేస్తే గుంటూరు రూట్‌లో నిడుముక్కల వరకు, విజయవాడ రూట్‌లో తుళ్లూరు వరకు, సత్తెనపల్లి రూట్‌లో పెదకూరపాడు వరకు, క్రోసూరు రూట్‌లో ఊటుకూరు వరకు ప్రమాదం జరిగిన 15 నిముషాలలో చేరుకునే అవకాశం ఉంది.
జరగాల్సిన నష్టం జరిగిపోతోంది..
ప్రమాదాలు సంభవించినప్పుడు అమరావతిలో అగ్నిమాపకదళ కేంద్రం ఉంటే ఆస్తులు, ప్రాణాలను కాపాడొచ్చు. ఎక్కడో దూరం నుంచి వచ్చేటప్పటికి నష్టం జరిగిపోతుంది. గతంలో ఉన్నతాధికారులకు ఎన్నో వినతులు సమర్పిస్తే మంజూరైన అగ్నిమాపక కేంద్రానికి స్థలసేకరణ జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిర్మాణం చేయకపోవడం శోచనీయం.
– కారసాల కుమార్,
రాజీవ్‌కాలనీ, అమరావతి
జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాం..
గతంలో అమరావతి గ్రామ పంచాయతీ 17 సెంట్లు స్థలం ఇస్తున్నట్లు తీర్మానం చేశారు. కానీ మాకు అందులో రెవెన్యూ శాఖ 12 సెంట్లు మాత్రమే అప్పగించింది. మిగిలిన ఐదు సెంట్లకు కూడా జిల్లా అగ్నిమాపక శాఖ తరఫున అనేకమార్లు రెవెన్యూశాఖకు రిమైండర్స్ పంపాం. ఈరోజుకు పెండింగ్ లోనే ఉంది. స్థలం 17 సెంట్లు అప్పగిస్తే గానీ అగ్నిమాపక కేంద్రానికి అంచనాలు వేస్తాం. జిల్లా కలెక్టర్‌కు ఈ సమస్యను నివేదిస్తాం.
– శ్రీధర్, పల్నాడు జిల్లా ఫైర్ ఆఫీసర్

అగ్గి బండి వచ్చేలోపు బుగ్గి!