సాక్షి ప్రతినిధి, గుంటూరు: తనకు నచ్చకపోయినా.. గెలవడన్న అనుమానం వచ్చినా.. అప్పటి వరకూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన ఎంతటి వారినైనా చంద్రబాబు నాయుడు వదిలించుకుంటాడన్న విషయం అందరికీ ఎరుకే. తాజాగా పదేళ్లపాటు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఐదేళ్లు మంత్రిగా, ప్రస్తుతం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ప్రత్తిపాటిని వదిలించుకునేందుకు పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ మరో వ్యక్తిని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుండటంతో చిలకలూరిపేట తెలుగుదేశంపార్టీ రాజకీయం రసకందాయంలో పడింది. దీనికి గత ఏడాది ప్రకాశం జిల్లాలో జరిగిన మహానాడు నాందీ పలికింది.
గుంటూరు జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బాష్యం ప్రవీణ్‌ను చిలకలూరిపేటలో రంగంలోకి దింపేందుకు తెరవెనుక ప్రయత్నాలు సాగుతు న్నాయి. ఇటీవల భాష్యం ప్రవీణ్ గుంటూరు పట్టణంతో పాటు యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలోనూ చిరువ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశాడు. టీడీపీ మహానాడు ప్రకాశం జిల్లా లో జరిగినప్పుడు యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామం హైవే పక్కనే మహానాడుకు వెళ్లే పార్టీ శ్రేణులకు ఉచిత అన్నదాన శిబిరాన్ని మూడు రోజులు ఏర్పాటు చేశారు. దీనిని చంద్రబాబు ప్రారంభించి అక్కడే ప్రచార రథంపై ఉండి ప్రసంగించారు. ఆ తర్వాత లోకేష్ యువగళం పాదయాత్రకు వెళ్లి సంఘీభావం తెలిపారు.
పాదయాత్ర విజయవంతం కావాలంటూ కొన్ని పాటల్నీ రిలీజ్ చేశారు. చిలకలూరిపేటలో రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా, అలాగే రోజా ఉన్న దీక్షాధారులకు ఇఫ్తార్ విందును వేర్వేరుగా ఇవ్వనున్నట్లు అలాగే పట్టణంలోని అన్నా క్యాంటిన్ ఏర్పాటు చేస్తానంటూ మీడియాకు వెల్లడించారు. దీంతో కంగారుపడిన ప్రత్తిపాటి తనకు సన్నిహితంగా ఉండే అచ్చెన్నాయుడి ద్వారా ప్రవీణ్‌కు ఫోన్ చేయించి ఈ కార్యక్రమం జరగకుండా చూశారు.
తర్వాత చంద్రబాబు నాయుడిని కలిసి తన గోడు వినిపించగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందగానే హైదరాబాద్‌కు ప్రత్తిపాటి ఫ్యామిలీతో సహా మకాం మార్చిన విషయాన్ని, కోవిడ్ వేళలోనూ పార్టీ వర్గీయులను పట్టించుకోలేదని, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను పట్టించుకోని విషయాన్ని, గత ప్రభుత్వ హయాంలో ప్రత్తిపాటి పుల్లారావు తన భార్య చేసిన వసూళ్లను అడ్డుకోలేదన్న విషయాలను చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలిసింది. అయినా ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా చూద్దాం అని చెప్పి పంపినట్లు తెలిసింది. ఇటీవల చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాలలో మిర్చి రైతులను పరామర్శించేందుకు చేపట్టిన యాత్రకు చిలకలూరిపేటలో స్పందన లేకపోవడం కూడా ప్రత్తిపాటిపై ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు.
మరోవైపు చిలకలూరిపేట నియోజకవర్గం టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న భాష్యం ప్రవీణ్ చంద్రబాబు 73వ పుట్టినరోజు నాడు వెళ్లి రూ.73 లక్షలు పార్టీకి విరాళంగా అందజేసి మార్కులు కొట్టేశాడు. ఇప్పటికే తనకు సహకరిస్తున్న కొంతమంది ప్రత్తిపాటిని వ్యతిరేకిస్తున్న నాయకుల ద్వారా పేట లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇది తెలిసి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం యువ గళం కార్యక్రమంలో లోకేష్‌ను ప్రత్తిపాటి కలిసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే లోకేష్ నుంచి ఎటువంటి హామీ రాలేదని సమాచారం. దీంతో ఈ నెల 15 నాటికి సీటు నాదే అని ప్రకటించకపోతే మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చని, దానికి తాను కూడా సహకరిస్తానని చెప్పినట్లు బాష్యం ప్రవీణ్ వర్గం నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికీ తమ మద్దతు ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment