
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వరస సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్నాటక నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు తమ వాహనాలను సీతమ్మవారి పాదాలు, కుమ్మరిపాలెం, పున్నమి ఘాట్, వీఎంసీ కార్యాలయాల వద్ద నిలుపుకొని దేవస్థాన బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు. పలువురు భక్తులు కనకదుర్గనగర్ మీదుగా మహా మండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు.
అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సర్వ దర్శనానికి రెండు గంటలు, రూ.100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్‌లో గంటకు పైగా సమయం పట్టింది. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment