స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఓడిద్దాం
ఎంఐఎం నాయకుడు పిలుపు
నరసరావుపేట: ముస్లిం మైనార్టీలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమిని ఓడించి ఘోరపరాజయాన్ని బహుమతిగా ఇవ్వాలని ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి పిలుపు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి టీడీపీ కూటమి మద్దతు పలకడం నమ్మక ద్రోహమని పేర్కొన్నారు.
పంట ధ్వంసంపై కేసు నమోదు
మార్టూరు: రైతు సాగు చేస్తున్న వ్యవసాయ భూమిలోని పంటను ధ్వంసం చేసిన విషయమై గురువారం రాత్రి మార్టూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏఎస్‌ఐ షేక్ మహబూబ్ బాషా వివరాలు.. గుంటూరులో నివాసం ఉండే పెంటేల సత్యనారాయణ మండలంలోని జంగమహేశ్వరపురంలోని తన భూమిని సాగు చేయిస్తుంటాడు. ఈ క్రమంలో ద్వారకపాడు గ్రామానికి చెందిన కాళహస్తి వాసుదేవ మూర్తి, వలపర్ల గ్రామానికి చెందిన తాళ్లూరి బెన్నయ్య గత బుధవారం ట్రాక్టర్‌తో సత్యనారాయణ భూమిలోని జొన్న పంట ధ్వంసం చేశారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న సత్యన్నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మహబూబ్ బాషా తెలిపారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని పసుపు యార్డులో శుక్రవారం 758 బస్తాలు అమ్మకాలు జరిగాయి. సరుకు, కాయలు కనిష్ట ధర రూ.10,000, గరిష్ట ధర రూ.11,000 పలికాయి.
ఇరువర్గాల ఘర్షణపై కేసు
తాడికొండ: బైక్ వ్యక్తిపైకి దూసుకొచ్చిన ఘటనపై ఇరువర్గాలు ఘర్షణకు దిగిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ కె.వాసు తెలిపిన వివరాలు.. పొన్నెకల్లులో అద్దెంకమ్మ తల్లి ఆలయం సమీపంలో నివసిస్తున్న మొగిలి రాము ఇంటి నుంచి బయటకు వస్తున్న క్రమంలో అదే కాలనీకి చెందిన ఆవుల మంద వెంకటేష్ బైక్‌ను ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగగా యువకులిద్దరికీ తలపై గాయమైంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పొలాల్లో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం
తాడికొండ: తాడికొండ మండలం బేజాత్‌పురంలోని పంట పొలాల్లో శుక్రవారం గుర్తు తెలియని 70 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది.ఎరుపు రంగు లంగా, లేత బ్లూ రంగు జాకెట్టు, లేత పచ్చరంగు చీర, తల వెంట్రుకలు తెలుపుగా ఉండి చామన చాయ రంగులో ఉంది. ఆచూకీ తెలిసిన వారు తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ తెలిపారు. స్థానిక వీఆర్‌ఓ రవి బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment