పక్కాగా చెక్కేసే పన్నాగం!
పట్టుమని పదవ తరగతి కూడా పూర్తి కాలేదు.. కానీ వందల మందిని ఎలా ముంచాలో మాత్రం నేర్చుకున్నాడు.. లెక్కలు అంతగా చదువుకోలేదు.. కానీ ఎంత కూడబెట్టాలో, ఎంత దోచుకోవాలనే విషయంలో మాస్టర్ చేశాడు.. చట్టాలంటే ఏమిటో కూడా తెలియదు.. కానీ ఆ చట్టాల్లో ఉన్న లొసుగులను ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసుకున్నాడు. ఇదీ పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆర్థిక నేరగాడు పుల్లారావు భాగోతం. ఏడవ తరగతి చదివిన పుల్లారావు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తనను నమ్మి డబ్బులిచ్చిన వారిని ముంచేసి పక్కాగా విదేశాలకు చెక్కేసే పన్నాగం వేశాడు.. దీనికి ముందే గుట్టు రట్టవడంతో కోర్టులో లొంగిపోయాడు.
నరసరావుపేట టౌన్: కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఆర్థిక నేరగాడు పాలడుగు పుల్లారావు కేసును పరిశీలించే కొద్దీ విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలతోపాటు తెలంగాణ, విదేశాల్లో ఉన్న వారు సైతం సాయిసాధన చిట్‌ఫండ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో అనేకమందిని నమ్మించి వంచించాడు. మరి కొంత మందికి వడ్డీ ఆశచూపి నిండా ముంచాడు. దాదాపు రూ.400 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డాడు.
విదేశాలకు వెళ్లేందుకు స్కెచ్..
పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన పుల్లారావు గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహి అగ్రి సంస్థ డైరెక్టర్ దండా రాజ్యలక్ష్మి వద్ద విజయలక్ష్మీ టౌన్‌షిప్ వెంచర్‌లో రూ.11.62 కోట్లు పెట్టుబడి పెట్టించాడు. తీసుకున్న నగదుకు వాటా ఇస్తానని నమ్మబలికాడు. అయితే నెలలు గడుస్తున్నా పుల్లారావు వాటా ఇవ్వకపోవడంతో జరిగిన మోసంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పుల్లారావు ఆర్థిక నేర ప్రపంచంలోని బాగోతాలు ఒక్కొక్కొటిగా బయటపడుతూ వచ్చాయి. ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో కొన్ని నెలలుగా బినామీ పేర్లతో ఆస్తులు కొన్నాడు. బంగారం, వజ్రాల రూపంలో నగదును దారి మళ్లించాడు. చీటీ పాటలు రిజిస్ట్రేషన్ శాఖ అనుమతులు లేకుండానే ఐదేళ్లుగా అక్రమంగా నిర్వహిస్తున్నాడు. అయితే ఈ స్కామ్ బయట పడక ముందే పుల్లారావు విదేశాలకు పారిపోయేందుకు పక్కా స్కెచ్ వేశాడు. గత ఏడాది డిసెంబర్ నెలలోనే తనతోపాటు కుటుంబ సభ్యుల పాస్ పోర్టులన్నీ రెన్యువల్ చేయించాడు. ఫిబ్రవరిలో తన కుమారుడి వివాహం జరిపించి, దర్జాగా ప్రజల సొమ్ము తీసుకుని ఎంచక్కా విదేశాల్లో స్థిరపడాలని పన్నాగం వేశాడు. ఇది బెడిసికొట్టడంతో కోర్టులో లొంగిపోయాడు.
లాయరు లేడంట.. రాలేడంట!
గుంటూరు సబ్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పుల్లారావును నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరినప్పటికీ చట్టంలోని లొసుగులను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఇప్పటి వరకు తాను లాయర్‌ను నియమించుకోలేదనే సాకు చూపుతూ పోలీసు కస్టడీకి రాకుండా తాత్సారం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనవద్దకు వచ్చిన బాధితుల వద్ద ముసలి కన్నీరు కారుస్తూ వారిని మరింతగా ముంచేందుకు ఎత్తులు వేస్తున్నాడు. తన వద్ద అప్పులకంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని వారిని మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో సుమారు రూ.400 కోట్లకుపై స్కామ్ జరిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని, బాధితుల వైపు నిలబడాల్సిందిపోయి పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
అన్ని వ్యవస్థలూ తన గుప్పిట్లోనే..
బాధితుల ఆవేదన..
ఇళ్లు, వాకిళ్లు అమ్మేసి.. పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం పుల్లారావు వద్ద దాచుకున్న సొమ్ము వస్తుందో లేదో అని బాధితులు ప్రతి రోజూ దిగులుతో కన్నీళ్లు కారుస్తున్నారు. ఇప్పటికే ఇన్‌చార్జి మంత్రి, నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు ఐజీ, ఎస్పీలను కలిసి న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు. బాధితులంతా రోడ్డెక్కినా న్యాయం చేయాలని వేడుకుంటున్నా ప్రభుత్వం మాత్రం ఆర్థిక నేరగాడు పుల్లారావుపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కల్పించుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
కుటుంబంతో విదేశాలకు
పారిపోయేందుకు పుల్లారావు వ్యూహం
గత ఏడాది డిసెంబర్‌లోనే
పాస్‌పోర్టుల రెన్యువల్
కుమారుడి వివాహం అనంతరం
గుట్టుగా తప్పించుకునేందుకు యత్నాలు
నేరాల చిట్టా బయటపడ్డాక
అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసిన ఘనుడు
ఇప్పడు పోలీసుల ముందుకు
వచ్చేందుకు ఇదే స్కెచ్ అమలు
పోలీసుల దగ్గర నుంచి అన్ని వ్యవస్థలను పుల్లారావు తన చేతుల్లో పెట్టుకున్నాడు. తన ఆర్థిక నేర ప్రపంచం గురించి బయటకు తెలిసినప్పటికీ ఎంచక్కా దర్జాగా కొడుకు పెళ్లి వేడుకలు నిర్వహించాడు. తాను అనుకున్నప్పుడే కోర్టులో లొంగిపోయాడు. దీని వెనుక తన సమీప బంధువైన సీఐ ప్రమేయం ఉందని బాధితులు గగ్గోలు పెడుతున్నా.. కూటమి ప్రభుత్వం కనీసం ఆ సీఐపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసే సాహసం చేయలేకపోయారు. దీన్ని బట్టి పుల్లారావు ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థను మేనేజ్ చేశాడో అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment