జీబీ సిండ్రోమ్‌ కలకలం | - | Sakshi
Sakshi News home page

జీబీ సిండ్రోమ్‌ కలకలం

Published Mon, Feb 17 2025 1:10 AM | Last Updated on Mon, Feb 17 2025 1:05 AM

జీబీ సిండ్రోమ్‌ కలకలం

జీబీ సిండ్రోమ్‌ కలకలం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో జీబీ సిండ్రోమ్‌ (గులియన్‌బెరి సిండ్రోమ్‌) కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు జీజీహెచ్‌లో ఆదివారం ప్రకాశం జిల్లా అలసానిపల్లెకు చెందిన బి.కమలమ్మ(45) చికిత్స పొందుతూ మృతి చెందింది. జీబీ సిండ్రోమ్‌తో ఈ నెల 3న జీజీహెచ్‌ న్యూరాలజీ వార్డులో అడ్మిట్‌ అయి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం కార్డియాక్‌ అరెస్ట్‌తో చనిపోయింది. వాస్తవానికి ప్రతినెలా గుంటూరు జీజీహెచ్‌లో పది మందికిపైగా ఈ వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన బాధితులు వారు గుంటూరు జీజీహెచ్‌కు తరలి వస్తున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జీజీహెచ్‌లో జీబీ సిండ్రోమ్‌ కేసులకు న్యూరాలజీ వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. ఖరీదైన ఇంజక్షన్‌లను తక్షణమే ఇస్తున్నట్లు న్యూరాలజీ వైద్యులు తెలిపారు.

భయపడాల్సిన పనిలేదు...

ఆదివారం చోటు చేసుకున్నది తొలి మరణమేమీ కాదని... గత ఏడాదిలో ఈ ఆస్పత్రిలోనే నలుగురు వ్యాధి బాధితులు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఖరీదైన వైద్యం అవసరమే తప్ప భయపడాల్సిన పని లేదని వైద్యులు పేర్కొన్నారు. లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి రావాల్సిందిగా సూచిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో గిద్దలూరుకు చెందిన కమలమ్మ మృతి చెందిది. కాగా, నరసరావుపేటకు చెందిన మరో మహిళ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిలో ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన వారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని న్యూరాలజిస్టులు వెల్లడించారు.

నెలకు 10 నుంచి 15 కేసులు

న్యూరాలజీ వైద్య విభాగానికి ప్రతి నెల 10 నుంచి 15 జీబీ సిండ్రోమ్‌ కేసులు వస్తూనే ఉన్నాయి. ఒక్కో పేషెంట్‌కు ఖరీదైన ఇమ్యూనో గ్లోబిన్‌ ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తోంది. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు జీజీహెచ్‌లో 115 మంది చికిత్స పొందారు. కాగా వీరిలో 66 మందికి మాత్రమే ఇంట్రావీనస్‌ ఇమ్యూనోగ్లోబిన్‌ ఇంజక్షన్లు చేయడం ద్వారా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇతరులు సాధారణ వైద్యం ద్వారానే రికవరీ అయినట్లు న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే ఇంజక్షన్లు అవసరం వస్తుందని తెలిపారు. ఒక్కో ఇంజక్షన్‌ రూ. 50 వేల వరకు ఉంటుందన్నారు. బాధితుల్లో 20 శాతం మందికి మాత్రమే ఈ ఇంజక్షన్లు చేయాల్సి వస్తోందని తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో కేవలం 5 నుంచి 7.5 శాతం మంది మాత్రమే మరణించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

వయస్సుతో సంబంధం లేకుండా ఆడ, మగ తేడా లేకుండా జీబీ సిండ్రోమ్‌ అందరికి సోకుతుంది. ఇది అంటు వ్యాధి మాత్రం కాదు. 25 శాతం మందికి ఈ వ్యాధి సోకడానికి కారణాలు తెలియదు. 20 శాతం మందికి దగ్గు, జలుబు వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, రిస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌ల వల్ల సోకుతోంది. గ్యాస్ట్రో ఎంట్రైటీస్‌ (జీఈ) ఇన్‌ఫెక్షన్‌ వల్ల, డయేరియా వల్ల కూడా వస్తోంది. కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం వ్యాధి సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణం. వ్యాధి నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలుత కాళ్లకు వ్యాధి సోకి తద్వారా శరీరం పై భాగానికి ఎగబాకుతుంది. వ్యాధి నుంచి కొంత మంది గంటల వ్యవధిలోనే కోలుకోవచ్చు. మరికొంత మందికి నెలల సమయం పడుతుంది. జ్వరం, విరేచనాలు, దగ్గు, జలుబు వచ్చి తగ్గుతున్న సమయంలో వారికి కాళ్లల్లో, చేతుల్లో తిమ్మిర్లు ప్రారంభమై కాళ్లు బలహీనపడితే దీనిని జీబీ సిండ్రోమ్‌గా గుర్తించాలి. తక్షణమే న్యూరాలజిస్టులను సంప్రదించాలి.

ఎలా వస్తుందంటే..

గుంటూరు జీజీహెచ్‌లో

బాధితురాలి మృతి

ప్రతినెలా సగటున

10 నుంచి 15 మందికి చికిత్స

సత్వర వైద్యసేవలు

అందిస్తుండటమే కారణం

భయపడాల్సిన పనిలేదంటున్న

వైద్య నిపుణులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement