గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
పిడుగురాళ్ల: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల ఎస్‌ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న మసీదు ఎదురు సిమెంట్ బెంచీ మీద గుర్తు తెలియని సుమారు 35 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతి చెంది ఉన్నాడని గుర్తించామన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
వెంకన్నకుంటలో గుర్తు తెలియని మహిళ...
వెల్దుర్తి: మండలంలోని మిట్టమీదిపల్లె గ్రామ సమీపంలోని వెంకన్న కుంటలో ఆదివారం సుమారు 30 నుంచి 40సంవత్సరాలలోపు ఉండే గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ సమందర్ వలి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని మిట్టమీది పల్లె గ్రామం వద్ద నీటి కుంటలో మహిళ మృతదేహం తేలాడుతుందనే గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి నీటి కుంటలో ఉన్న మహిళ మృతదేహాన్ని వెలుపలకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతురాలి మెడలో పసుపు కొమ్ము, పసుపు తాడు, కాలికి రాగి మెట్టలు ఉన్నట్లు తెలిపారు. ఈ మహిళ మూడు రోజుల కిందట ఈ కుంటలో పడినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మహిళ ఆచూకీ తెలిసిన వారుంటే వెంటనే వెల్దుర్తి పోలీసు స్టేషన్‌కు సమాచారమివ్వాలని ఎస్‌ఐ సమందర్ వలి కోరారు.
రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ..
బొల్లాపల్లి: మిరప కోతకు వచ్చిన కూలీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన మండలంలోని రావులాపురం – రేమిడిచర్ల గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం జరిగింది. బండ్లమోటు పోలీసులు, ఆయా గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలోని నల్లదిబ్బల పల్లెకు చెందిన పల్లపు చిన్న (25) మండలంలోని గుమ్మనంపాడు గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మిరప కాయల కోత కూలికి వచ్చాడు. తన ద్విచక్ర వాహనంపై గుమ్మనంపాడు నుంచి రాజులపాలెం వెళ్తుండగా మార్గ మధ్యంలో గుర్తుతెలియని వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్న అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని తల్లి పల్లపు మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బండ్లమోటు ఎస్‌ఐ ఎ.బాలకృష్ణ తెలిపారు. మృతుడికి భార్య స్వాతి, ఒక కుమారుడు కలరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా.. రోడ్డు ప్రమాదానికి సంబంధించి యువకుడు మృతిచెందిన సంఘటన ప్రాంతంలో మండలంలో రెండు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే వాహనానికి చెందిన నంబరు ప్లేట్ పడి ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే వాహనం అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment