అచ్చంపేట: ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలలో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు వారి వారి మండలాల్లో తిరిగే హక్కులేదా? తిరిగితే దాడులుచేసి, తప్పుడు కేసులు బనాయిస్తారా? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని నియోజకవర్గంలోని ఐదు మండలాల జెడ్పీటీసీ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు పెదకూరపాడు మండలంలోని గారపాడు ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లిన పెదకూరపాడు జెడ్పీటీసీ కంకణాల స్వర్ణకుమారి భర్త కంకణాల శివాజీపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. న్యాయబద్దంగా గెలిచిన తాము ప్రజల్లో తిరగకూడదా ..గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులున్నాయా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రేక్షకుల్లా మారిపోయిన పోలీసులు తమపైనే తప్పుడు కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయాన్యాయాలను విచారించాలని, ఎవరో ఏదో తప్పుడు ఫిర్యాదుచేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని తప్పుడు కేసులు బనాయించడం సరికాదన్నారు. తాము ఇచ్చే ఫిర్యాదులుగాని, తాము చేప్పేదిగాని పట్టించుకోకపోవడం ఖచ్ఛితంగా వివక్ష చూపడమేనన్నారు. పోలీసులు శాంతిభద్రతులు కాపాడేలే తప్ప గొడవలు సృష్టించడం, తప్పుడు కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమన్నారు? అధికారంలోకి వచ్చిన పార్టీవారు ఎవరైనా సరే ప్రజలకు ఏవిధంగా మేలు చేయాలి, ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తున్నాం, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి అనేదానిపై దృష్టిపెట్టాలిగానీ, ఎవరిపై దాడులు చేద్దాం, ఎంతమందిపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుదాం అనే విధంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికై నా తప్పుడు కేసులను విరమించుకుని, దాడులకు స్వస్తి చెప్పి ప్రజాభివృద్ధి కోసం పాలన కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట, అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ మండలాల జడ్పీటీసీ సభ్యులు తుమ్మా విజయప్రతాప్ రెడ్డి, కరుణకుమారి, షేక్ జమీల్, గాదె వెంకటరెడ్డిలతో పాటు జిల్లా పరిషత్ కో–ఆప్షన్ సభ్యులు షేక్ సర్థార్ షమి తదితరులున్నారు.
పెదకూరపాడు జెడ్పీటీసీ భర్త శివాజీపై టీడీపీ నేతలు దాడిచేయడం దారుణం
అచ్చంపేట, అమరావతి, క్రోసూరు,
బెల్లంకొండ మండలాల జెడ్పీటీసీ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment