తిరునాళ్లను విజయవంతం చేద్దాం
సమీక్షలో అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
నరసరావుపేట: జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి కోటప్పకొండ తిరునాళ్లను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో కోటప్పకొండ తిరునాళ్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ అధికారి రాజానాయక్ మాట్లాడుతూ 21 నుంచి తిరునాళ్లలో బారికేడ్లు నిర్మిస్తామని, రహదారులు విస్తరణ, పెండింగ్ మరమ్మతులు వంటివి పూర్తి చేస్తామన్నారు. మరో మూడు రోజుల్లో అప్రోచ్ రోడ్డు నిర్మాణాలు, గ్రావెల్ ప్యాచ్ వర్కులు, జంగిల్ క్లియరెన్స్ పూర్తిచేస్తామని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.రవి మాట్లాడుతూ కొండ దిగువ నుంచి పైవరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, 108 వాహనాలు, క్యూలైన్ల వద్ద, మెట్ల మార్గంలో, కొండపైన మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్‌పోర్ట్ అధికారులు, ఆర్టీసీ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు తమతమ పరిధిలో జరుగుతున్న పనులను వివరించారు. పౌరాణిక, సాంఘిక నాటకాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దేవదాయ శాఖ అధికారులు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో తిరుణాళ్ల నిర్వహణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ కోటప్పకొండను సందర్శించి పనులను పరిశీలించారు.
20 నుంచి పాఠశాలల్లో ‘స్ఫూర్తి’
నరసరావుపేట: పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులలో భయం పోగొట్టేందుకు జిల్లాలో ఈనెల 20 నుంచి ‘స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిపుణలతో ఆన్‌లైన్ విధానంలో విద్యార్థులను అనవసర ఒత్తిడికి గురికాకుండా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ’స్ఫూర్తి’ పోస్టర్ విడుదల చేశారు. జిల్లాలోని బాలికల సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన భద్రత కోసం ‘రక్ష ’ పేరుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాలో 90 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. శివరాత్రి మరుసటి రోజే ఎన్నికల పోలింగ్ ఉన్నందున నరసరావుపేటలో పోలింగ్ పూర్తయ్యే వరకూ ప్రభల తిరుగు ప్రయాణానికి ఆంక్షలుంటాయన్నారు. ప్రతి నెలా మూడో శనివారం గ్రామస్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతి నెలా ఒక గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తానని చెప్పారు. వారంలో ఒక రోజు ఒక సంక్షేమ హాస్టల్‌లో బస చేస్తామని, ఉన్నతాధికారులు సైతం వారంలో ఒక రోజు హాస్టళ్లలో రాత్రిపూట బస చేయాల్సివుంటుందన్నారు. వేసవిలో నీటి ఎద్దడిని తగ్గించేందుకు పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు. జేసీ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్‌ఓ ఎ.మురళి, డీఈఓ చంద్రకళ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment