అమ్మభాష ఆనందాలు
యడ్లపాడు: మాటలు, రాతలు, దైనందిన జీవితంలోని ప్రతి వ్యక్తీకరణలో తల్లిభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని చాటిచెప్పేదే మాతృభాషా దినోత్సవం. ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మాతృభాషను మననం చేసుకునే శుభతరుణం. జాతి మనుగడకు భాషే ప్రధానమని స్మరించుకునే రోజు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు వీటిని నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యాయి.
నాలుగు రోజుల పాటు సంబరాలు
భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు, అది ఒక సంస్కృతిని, విలువలను, జీవన విధానాన్ని ప్రతిబింబించే గొప్ప వారసత్వం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యాసంస్థలు భాషా సంబరాలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. భాషా అభివృద్ధికి, విద్యార్థుల్లో నైపుణ్యాల వికాసానికి తోడ్పడేలా ప్రభుత్వ బడులు, కళాశాలలు సన్నద్ధమవుతున్నాయి.
పోటీల నిర్వహణ ఇలా..
ఈ సంబరాల్లో కథలు చెప్పటం, రచన, చర్చలు, వక్తృత్వం, పాత్రపోషణ, బోధనోపకరణాల తయారీ వంటి పోటీలు నిర్వహించనున్నారు. సంస్కృతంలో చిన్నకథలు రాయడం, శ్లోకాలు, పద్యాలు, ఉర్దూ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రాసలు, గజల్స్ చెప్పే అవకాశం ఉంది. గిరిజన భాషలు సంస్కృతి ప్రతిబింబించేలా సంప్రదాయ నృత్యాలు, పాటలు, ఆటలు కూడా చోటు చేసుకోనున్నాయి. ఈనెల 18వ తేదీన ఆంగ్లం, 19న సంస్కృతం, హిందీ, ఉర్దూ, 20న గిరిజన భాషలు, కన్నడం, తమిళం, ఒరియా 21న తెలుగు భాషకు సంబంధించి పోటీలు నిర్వహించనున్నారు. పోటీల నిర్వహణకు పాఠశాలకు రూ. 500 కేటాయించినట్లు వెల్లడించారు.
నేటి నుంచి బడుల్లో భాషల సంబరాలు 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహణ 18వ తేదీ నుంచి 21 వరకు వివిధ అంశాల్లో పోటీలు
సృజనాత్మకతకు చోటు..
భాషా సంబరాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, భాషపట్ల ప్రేమను పెంపొందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. లుప్తమవుతున్న భాషల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ సంబరాల ప్రత్యేకత. ప్రతి పాఠశాలలో వీటి నిర్వహణకు హెచ్‌ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
– ఎల్ చంద్రకళ, జిల్లా విద్యాశాఖ అధికారి, పల్నాడు
Comments
Please login to add a commentAdd a comment