అదిగో జాగా.. వేసేయ్ పాగా
నరసరావుపేట రూరల్: భూముల ధరలు పెరిగిపోవడంతో చిన్న జాగా కనిపించినా పచ్చనేతలు వదిలిపెట్టడం లేదు. కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారు. దాదాపు రూ.2.కోట్ల విలువైన స్థలాన్ని కబ్జాచేసి ఇళ్లు నిర్మిస్తున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నైత్తైనా చూడటం లేదు.
భూముల ధరలు పెరగడంతో..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నరసరావుపేటను జిల్లా కేంద్రంగా చేయడంతో భూములు ధరలు అమాంతం పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు పట్టణానికి సమీపంలోని గ్రామాల వరకు వేశారు. ఫలితంగా పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల్లోనూ సెంటు భూమి రూ.5లక్షలకుపైగా పలుకుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విలువైన ప్రభుత్వ భూములపై టీడీపీ నేతలు కన్ను పడింది. ఆయా స్థలాలను దర్జాగా ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.
అల్లూరివారిపాలెం ఎస్టీ కాలనీలో
అల్లూరివారిపాలెం గ్రామంలో నాలుగు దశాబ్దాల క్రితం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కాలనీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాలనీల ఏర్పాటు సమయంలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 శాతం భూమిని కేటాయించారు. ఎస్టీ కాలనీకి ఈ విధంగా కేటాయించిన భూమి 30 సెంట్ల వరకు ఉంది. ఈ భూమి ఖాళీగా ఉండటంతో స్థానికులు వివిధ అవసరాల కోసం వినియోగించేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ భూమిపై స్థానిక టీడీపీ నాయకుల కన్నుపడింది. గ్రామ మాజీ సర్పంచ్‌తోపాటు మరికొందరు కలసి ఈ భూమిని ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు.
భూమి విలువ రూ.2కోట్లు పైమాటే!
కలెక్టర్ కార్యాలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే అల్లూరివారిపాలెం ఎస్టీ కాలనీ ఉంది. లింగంగుంట్ల కాలనీ నుంచి అల్లూరివారిపాలెంలోని ఎస్టీ కాలనీ వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. దీంతో ఈ భూములకు విలువ వచ్చింది. ఇక్కడ సెంటు రూ.7లక్షల వరకు పలుకుతోంది. ఆక్రమణకు గురైన భూమి దాదాపు 30 సెంట్లు ఉండటంతో దీని విలువ రూ.2కోట్లపైగా ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు.
రూ.2 కోట్లు విలువైన భూమి కబ్జా
అల్లూరివారిపాలెంలో టీడీపీ నాయకుల ఆక్రమణ కాలనీ అవసరాల కోసం కేటాయించిన భూమిలో నిర్మాణాలు
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
కాలనీలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై సమాచారం లేదు. వీఆర్వోను పంపి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా చట్టపరమైన చర్యలు ఉంటాయి.
– వేణుగోపాల్, తహాసీల్దార్
అదిగో జాగా.. వేసేయ్ పాగా
Comments
Please login to add a commentAdd a comment