శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
సత్రశాల(రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 26న సత్రశాల వద్ద వేంచేసిన గంగాభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానానికి తరలివచ్చే వేలాదిమంది భక్తుల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు ఎస్పీ కె.శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం ఆయన సత్రశాల దేవస్థానం వద్ద మహాశివరాత్రికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఈఓ గాదె రామిరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి సూచనలు చేశారు. ఎస్‌ఐ సీహెచ్ నాగార్జునతోనూ బందోబస్తు గురించి మాట్లాడారు. పలు సూచనలు చేసి మాట్లాడారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ప్రభలను తక్కువ ఎత్తులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని, ప్రభలపై అశ్లీల నృత్యాలు, ఇతరులను కించపరిచేలా, ఇబ్బంది పెట్టేలా పాటలు పాడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా రెంటచింతల పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సందర్శించారు. ఎస్పీ వెంట గురజాల డిఎస్పీ పి.జగదీష్, కారంపూడి సీఐ టి.వి. శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment