చిలకలూరిపేట: మాజీ మంత్రి విడదల రజిని మామ లక్ష్మీనారాయణ కారుపై టీడీపీ వర్గీయులు ఆదివారం దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ విషయమై కారు డ్రైవర్ ఉప్పుతోళ్ల రాజు చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని గుండయ్యతోటకు చెందిన ఉప్పుతోళ్ల రాజు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విడదల లక్ష్మీనారాయణ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం లక్ష్మీనారాయణను ఆయన నివాసం వద్ద దింపి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు కారులో వెళుతున్నాడు. పురుషోత్తమపట్నంలోని వేణుగోపీనాథస్వామి ఆలయం వద్ద టీడీపీ వర్గీయులైన బైరా వెంకటప్పయ్య, బత్తినేని శ్రీనివాసరావు, తోట మనోహర్, తోటపల్లి శ్రీను, తోట సత్యనారాయణ మరికొందరితో కలసి కారును అడ్డగించి ఆపారు.
మారణాయుధాలతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గురించి లక్ష్మీనారాయణ, విడదల రజినికి మాట్లాడే అర్హత లేదంటూ అసభ్యపదజాలంతో దూషణలకు దిగారు. వాళ్లను చంపేస్తాం, బతకనిచ్చేది లేదంటూ దూషణలకు దిగారు. కారు అద్దాలు పగలగొట్టి, చొక్కా పట్టుకొని బయటకు లాగి దాడి చేసేందుకు యత్నిస్తున్న సమయంలో డ్రైవర్ తప్పించుకొని పోయాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై అర్బన్ సీఐ పి రమేష్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment