యడ్లపాడు: మహిళ మెడలోని బంగారు గొలుసుకును లాక్కొని పరారైన వ్యక్తిని గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన పావులూరి మల్లేశ్వరి హైవే పక్కన కృష్ణగంగ నూలుమిల్లు వద్ద ఓ బడ్డీకొట్టు నడుపుతోంది. సోమవారం మధ్యాహ్నం బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు. ఒకరు బైక్‌పై ఉండగా, మరొకరు దిగి దుకాణం వద్దకు వచ్చి సిగరెట్, కూల్‌డ్రింక్ ఆర్డర్ చేశాడు. వాటిని ఇవ్వబోతున్న సమయంలోనే ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరుగున వెళ్లి బైక్ ఎక్కాడు. ఊహించని ఈ ఘటనకు షాక్ అయిన మల్లేశ్వరి కొద్దిసేపటికి తేరుకుని పెద్దగా కేకలు వేసింది. జనం పోగయ్యేలోగా గుర్తు తెలియని ఆ ఇద్దరు అక్కడి నుంచి ఉడాయించారు. బాధితురాలు యడ్లపాడు పోలీసులకు సమాచారం అందించగా అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. రూ.2.65 లక్షల విలువైన నాలుగు సవర్ల గొలుసు చోరీ అయినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. పోలీసులు సాంకేతిక సాయంతో రెండు గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నరసరావుపేట డీఎస్సీ పర్యవేక్షణలో చిలకలూరిపేట సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్‌ఐ వి బాలకృష్ణ, కానిస్టేబుల్స్ పోతురాజు, వినోద్, సాంబ ఆధ్వర్యంలో కేసు ఛేదించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment