తక్కువ ధరకే టెండర్ ఖరారు చేసినా ఆరోపణలు
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ నుంచి మంజూరు చేస్తున్న ప్రతి పనిలో కమిషన్లు దండుకుంటూ తిరిగి అధికారులపై ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూ రచ్చకెక్కడటం పరిపాటిగా మారింది. జెడ్పీ సీఈవో విధుల్లో నిత్యం జోక్యం చేసుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లినా, అక్కడ అవినీతి జరుగుతోందని తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారు. జెడ్పీలో సీఈవోగా కొనసాగుతున్న ఉన్నతాధికారిపై పాలకవర్గంలో ఉన్న కీలక వ్యక్తులు సాగిస్తున్న తప్పుడు ప్రచారాన్ని జెడ్పీటీసీలు ఖండిస్తున్నారు. అవినీతి, అక్రమ సంపాదనతో జెడ్పీని భ్రష్టు పట్టిస్తున్న ఆమె సీఈవోలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ జెడ్పీ పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు.
వచ్చిన మూడు నెలలకే ఫిర్యాదుల పరంపర
ప్రస్తుతం సీఈవోగా పనిచేస్తున్న వి. జ్యోతిబసు గుంటూరు జిల్లాకు వచ్చి మూడు నెలలైంది. కృష్ణాజిల్లా సీఈవోగా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో ఇక్కడికి వచ్చిన ఆయనపై అప్పుడే జెడ్పీ పాలకుల నుంచి పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదులు వెళ్లాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు వరుసగా రెండేళ్ల పాటు ‘‘జగనన్న విద్యాజ్యోతి’’ పేరుతో స్టడీ మెటీరియల్ ముద్రించి పంపిణీ చేశారు. జెడ్పీ పాలకులు పార్టీ మారిన తరువాత మూడోసారి మెటీరియల్ పంపిణీకి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ నుంచి మెటీరియల్ తెప్పించుకుని, టెండర్లు పిలిచి ప్రింటింగ్ చేయించే బాధ్యత సీఈవోకు అప్పగించారు. అయితే, ముద్రణలో ఉండగానే మరో వైపు స్టడీ మెటీరియల్ పంపిణీలో జాప్యం అంటూ ఆరోపణలు చేయించారు. అధికారులను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. స్టడీ మెటీరియల్‌పై సీఎం, విద్యాశాఖ మంత్రి ఫోటోలు ముద్రించలేదని, సీఈవోను లక్ష్యంగా చేసుకున్నారని జెడ్పీటీసీలు ఆరోపిస్తున్నారు.
సీఈవో పోస్టు అంటే హడలెత్తిపోతున్న అధికారులు జెడ్పీని నడిపిస్తున్న అమ్మ అవినీతికి బలి తమ అవినీతిని దాచి అధికారుల చేతికి మసిపూస్తున్న వైనం నాలుగేళ్లలో మారిన నలుగురు సీఈవోలు ప్రస్తుత సీఈవో వచ్చిన మూడు నెలలకే ఫిర్యాదుల పరంపర
ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 34,747 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ముద్రణకు సంబంధించి గతంలో కంటే తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టినా సీఈవోపై అర్థం లేని అవినీతి ఆరోపణలు చేయించారు. ఒక పేజీ ముద్రణకు గతంలో 33 పైసలు చెల్లించగా, ప్రస్తుతం అది 30 పైసలకే ఖరారు చేశారు. ఈ విధంగా 564 పేజీలతో ముద్రణ పూర్తయిన పుస్తకాలకు గాను జెడ్పీకి రూ. లక్షల్లో ఆదా అయింది. టెండర్ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున అధికారులపై ఆరోపణలు సాగిస్తుండగా, అసలు ఇప్పటి వరకు ముద్రణదారులకు చెల్లింపులు జరపలేదని అధికారులు చెబుతున్నారు. స్టడీ మెటీరియల్‌కు పైసా చెల్లించకుండా అవినీతి ఆస్కారం ఎక్కడ ? అని పలువురు జెడ్పీటీసీలు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీకి సీఈవోలుగా వచ్చిన వారిపై అవినీతి ఆరోపణలు చేస్తూ, వారిని బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు దృష్టి సారించిన పరిస్థితులు లేవు. పరిస్థితులు ఇలాగే ఉంటే జెడ్పీ సీఈవోగా వచ్చేందుకు సైతం అధికారులు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment