ఎన్నికల్లో కూటమి నేతల దౌర్జన్యం దారుణం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పీడీఎఫ్ ఏజెంట్లపై కూటమి నాయకుల దాడులు ఖండనీయం అని సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు విజయకుమార్ అన్నారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా ఈ దాడులు, దౌర్జన్యాలకు నిరసనగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పుతుంభాక భవన్ నుంచి తాలూకా సెంటర్ వరకు గురువారం జరిగిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండగా ఒకవిధంగా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. పలువురు పచ్చ నేతలు పీడీఎఫ్ ఏజెంట్లుపై దాడులు, దౌర్జన్యాలు చేసి రిగ్గింగు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కి మద్దతుగా నిలిచే ఓటర్లు అధికంగా బెంగళూరు, హైదరాబాద్, విదేశాలలో ఉన్నారని గుర్తుచేశారు. వారు రాకపోయినప్పటికీ వారి బదులు దొంగ ఓట్లు వేసి రిగ్గింగ్‌కు పాల్పడడంతో ఒక్కో పోలింగ్ బూత్ లో 80 నుండి 91 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి సాధారణ ఎన్నికలలో కూడా 80 శాతం నుంచి పోల్ కాని పరిస్థితులు ఉంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో 80 నుండి 90 శాతం వరకు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. 80 శాతం మించి పోలైన బూత్‌లలో రీపోలింగ్ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకుడు గద్దె చలమయ్య, కౌలు రైతు సంఘం నాయకుడు పెండ్యాల మహేష్, చేనేత కార్మిక సంఘం నాయకుడు కె. శివదుర్గారావులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు డి విమల, జి ఉమాశ్రీ, మునగాజ్యోతి, ఎ వీరబ్రహ్మం, డి పుల్లారావు, పి ప్రభాకర్, పి.సూర్యప్రకాశరావు, రాజ్‌కుమార్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు విజయ్ కుమార్
సత్తెనపల్లిలో ప్రజాసంఘాల నాయకుల నిరసన ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment