రాజకీయ కక్షసాధింపులతోనే ఆత్మహత్యాయత్నం
● రాష్ట్ర ఆశ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ధనలక్ష్మి ● గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆశ వర్కర్ సామ్రాజ్యంకు పరామర్శ
పెదకూరపాడు: ఆశ కార్యకర్త రాయపాటి సామ్రాజ్యం ఆత్మహత్యాయత్నానికి కారకులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఆశ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. టీడీపీ నేతల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన రాయపాటి సామ్రాజ్యాన్ని బుధవారం గుంటూరు జీజీహెచ్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా చాలీచాలని వేతనంతో ఆశ కార్యకర్తగా సక్రమంగా విధులు నిర్వహించిన సామ్రాజ్యంను గ్రామ సర్పంచ్, ఆమె భర్త సోమశేఖర్, ఆయన అనుచరులు రాజకీయ కక్ష సాధింపులకు గురిచేశారన్నారు. ఆశ కార్యకర్త ఉద్యోగాన్ని తొలగించేందుకు అనేకసార్లు ఫిర్యాదులు చేసి మనోవేదనకు గురిచేశారన్నారు. సామ్రాజ్యం విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిందన్నారు. అందుకే వైద్యసిబ్బంది ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. సామ్రాజ్యం ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment