న్యాయవాది కొలుసు సీతారాంపై దాడి హేయం
పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్
సత్తెనపల్లి: నూజివీడు న్యాయవాది కొలుసు సీతారాంపై దాడి హేయమైన చర్య అని, ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోవటం దారుణమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ న్యాయవాది చిలుకా చంద్రశేఖర్ అన్నారు. న్యాయవాది కొలుసు సీతారాంపై జరిగిన దాడిని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గురువారం ఆయన ఖండించారు. ఈ సందర్భంగా చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు లెక్కచేయలేదంటే సామాన్య పౌరుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్ధమవుతుందన్నారు. న్యాయవాద చట్టాల సవరణను మేధావులు, ప్రజాస్వామిక వాదులతో కలసి పౌరసమాజం అర్థం చేసుకోకపోవటం వల్ల పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అపరిమితమైన అధికారాలు చట్ట సభలు పోలీసులకు ఇవ్వటమే ఈ పరిస్థితికి కారణమన్నారు.
నీటి కాసులపై అవగాహన అవసరం
జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ భువనేశ్వరి
పెదకూరపాడు: నీటి కాసులపై అవగాహన కలిగి ఉండాలని అంధత్వ నివారణ సంస్థ అధికారి డాక్టర్ భువనేశ్వరి అన్నారు. ప్రపంచ గ్లోకోమా (నీటి కాసులు) వారోత్సవాలు సందర్భంగా అమరావతి అమర్ కాలేజీ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ సహకారంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం నీటి కాసులపై అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ భువనేశ్వరి మాట్లాడుతూ నీటి కాసుల సమస్యను సకాలంలో తెలుసుకోకపోతే అంధత్వ లక్షణాలు, చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వీటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆప్తాల్మిక్ ఆఫీసర్ రామకృష్ణ అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది మనోహర్, సామ్రాజ్యం, అరుణ శ్రీ, త్రిషా, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
శింగరకొండ తిరునాళ్లకు 12 ప్రత్యేక బస్సులు
నరసరావుపేట: ఈనెల 14న శుక్రవారం బాపట్ల జిల్లా శింగరకొండలో జరిగే శ్రీ ఆంజనేయస్వామి తిరునాళ్లకు భక్తులు వెళ్లేందుకు నరసరావుపేట డిపో నుంచి 12 బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ బి.శ్రీనివాస్ గురువారం వెల్లడించారు. అవి ఏల్చూరు, కొమ్మాలపాడు మీదుగా శింగరకొండకు చేరుకుంటాయన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
న్యాయవాది కొలుసు సీతారాంపై దాడి హేయం
Comments
Please login to add a commentAdd a comment