16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక
వినుకొండ: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధ లింగమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 26 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సామాజిక తనిఖీ బృందం సమర్పించిన నివేదికలను పీడీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో అవకతవకలను మొత్తం రూ.48వేలు పెనాల్టీలు విధించారు. అలాగే రూ.4,00,858లు రికవరీ చేయడానికి ఆదేశించారు. కొన్ని అంశాలపై ఏపీడీ విచారణకు ఆదేశిస్తూ రూ.58,876లు కేటాయించారు. గ్రామసభల్లో కూలీలు లేవనెత్తిన అంశాల ఆధారంగా రూ.96,227లు డ్రాప్ చేయాలని నిర్ణయించారు. రైతులు నాటిన మొక్కలను తిరిగి నాటాలని, రోడ్డు పక్కన నాటిన మొక్కలను పునరుద్ధరించాలని ఆదేశించారు. అంతేకాకుండా రూ.10,47,594 విలువైన పండ్ల తోటల మొక్కలు నాటాలని సూచించారు. మొత్తం మీద ఈ సామాజిక తనిఖీల్లో రూ.15,92,679 విలువైన అవకతవకలను గుర్తించారు. ఈ అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశించారు. కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment