వైభవంగా ముగిసిన శతచండీ మహాయాగం
సత్తెనపల్లి: లోక కళ్యాణార్థం భక్తిశ్రద్ధలతో పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శతచండీ మహాయాగం నిర్వహించడం అభినందనీయమని శైవ క్షేత్రాదీశ్వరులు, విశ్వధర్మ పరిరక్షణ వేదిక వ్యవస్థాపకుడు శ్రీశ్రీశ్రీ శివస్వామి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని త్రిశక్తి దుర్గాపీఠంలో హనుమత్ స్వామి వారి ఆధ్వర్యంలో ఈనెల 6న చేపట్టిన పంచాయతన పూర్వక నవదుర్గాత్మక శతచండీ మహాయాగం శనివారం భక్తిశ్రద్ధలతో వైభవంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో శివస్వామి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం త్రిశక్తి దుర్గా పీఠాన్ని స్థాపించి భక్తి, జ్ఞాన, సేవ, ధర్మ మార్గాన్ని హనుమత్ స్వామి అందిస్తున్నారన్నారు. లోక కళ్యాణార్థం రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని నవదుర్గాత్మక శత చండీ మహాయాగం నిర్వహించడం విశేషం అన్నారు. పది రోజుల పాటు హోమాలు ప్రత్యేక పూజలు బ్రహ్మశ్రీ కంభంపాటి ఉదయ్ కృష్ణ వారి బృందం అత్యంత వైభవంగా నిర్వహించారన్నారు. మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి ఒకే పీఠంపై ఉండడం చాలా విశేషమని, అలాగే ప్రసన్నాంజనేయ స్వామి వారు చాలా ప్రత్యేకమన్నారు. ఈ సందర్భంగా సర్వతోభద్ర మండల హోమాలు, ప్రాయశ్చిత్త హోమాలు, శాంతి హోమాలు, మహా పూర్ణాహుతి, శివపార్వతుల కల్యాణం, ప్రోక్షణ, వేద ఆశీర్వచనం, పండితుల సత్కారాలు చేపట్టి భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా గణేష్ యువసేన, త్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవ కమిటీ, త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వైభవంగా ముగిసిన శతచండీ మహాయాగం
Comments
Please login to add a commentAdd a comment