నేడు మహా శైవక్షేత్రం పునఃప్రతిష్టా మహోత్సవం
దాచేపల్లి: మండలంలోని గామాలపాడు గ్రామంలో మహాశైవక్షేత్ర పునఃప్రతిష్ట మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం జరిగే ఈ కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పల్నాటి తొలి మహిళా మంత్రిణి నాయకురాలు నాగమ్మ 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ మహాశైవక్షేత్రం శిథిలావస్థకు చేరుకోవటంతో పునఃప్రతిష్ట చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సుమారుగా 15 ఎకరాల విస్తీర్ణంలో మహాశైవక్షేత్రంలో పలు దేవాలయాల నిర్మాణాలు, ముఖద్వారాలు, మండపాలు నిర్మాణం కోసం ఏర్పాట్లు చేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి పర్యవేక్షణలో మహాశైవక్షేత్రం పనులు జరుగుతున్నాయి. పునఃప్రతిష్టకి సంబంధించిన పనులు పూర్తి చేశారు. పురాతన ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో పందిళ్లు ఏర్పాటు చేశారు. పుణ్యదంపతులు ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నారు.
నేడు మంత్రి, టీటీడీ చైర్మన్ రాక..
మహాశైవక్షేత్రం పునఃప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనేందుకు అతిధులు వస్తున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటుగా పలువురు ప్రముఖులు వస్తున్నారని, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈప్రతిష్ట మహోత్సవంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment