తిరుపతమ్మతల్లి తిరునాళ్లలో ఆకట్టుకున్న ప్రభలు
అచ్చంపేట: మండలంలోని కోనూరులో శ్రీలక్ష్మీ తిరుపతమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవంలో గ్రామస్తులు పోటాపోటీగా విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. గ్రామంలో స్వయంభుగా వెలసిన లక్ష్మీ తిరుపతమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి తెల్లవారు జామువరకు విద్యుత్ వెలుగులతో విద్యుత్ ప్రభలు చీకటిని పాలదోలాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు భక్తిశ్రద్ధలతో రూ.4లక్షల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ప్రభ ఎంతో ఆకట్టుకుంది. టీడీపీ, జనసేన పార్టీలవారు కూడా విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన భక్తులు మరో విద్యుత్ ప్రభను ఏర్పాటుచేశారు. తెల్లవారు జామున నాలుగు గంటల వరకు విద్యుత్ ప్రభలవద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 4వేలు జనాభాగల గ్రామంలో 5 విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేయడం విశేషం. చుట్టు పక్కల గ్రామాలనుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, ప్రభలవద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అచ్చంపేట సీఐ పి.వెంకటప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment