విత్తన గుళికల విధానంతో మేలు
డీపీఎం కె.అమలకుమారి
నరసరావుపేట రూరల్: వర్షాభావ పరిస్థితుల్లో రైతులు భూమిని కప్పి ఉంచే విత్తన గుళికల తయారీ విధానాన్ని అవలంభించాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. ప్రకృతి వ్వవసాయం జిల్లా కార్యాలయంలో సిబ్బందికి నిర్వహిస్తున్న మూడవ రోజు శిక్షణా కార్యక్రమానికి జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హాజరయ్యారు. డీపీఎం అమలకుమారి మాట్లాడుతూ వేసవిలో ప్రతి రైతు తనకున్న పొలంలో ఈ విత్తన గుళికల విధానం ఆచరించాలని తెలిపారు. దీని ద్వారా భూమిలో తేమశాతం, కార్బన్ ఆవిరి కాకుండా ఉంటాయని తెలిపారు. కార్బన్ శాతం పెరగడం వలన తరువాత సాగుచేసే ప్రధాన పంటకు చీడపీడల ఉధృతి తగ్గుతుందని, మొక్కకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. ఈ విధానం వలన రైతులకు రసాయన ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ విత్తనాలు భూమిలో ఆరునెలల పాటు ఎటువంటి చీడపీడల ఆశించకుండా కొద్దిపాటి వర్షానికే మొలకెత్తుతాయని తెలిపారు. దీని ద్వారా రైతు కుటుంబానికి అవసరమైన ఆకుకూరలు లభించడంతో పాటు పశువులకు మేత లభిస్తుందని చెప్పారు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమేక్‌రాజు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘం సభ్యులు కేఏసీ కార్యక్రమంలో పాల్గొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా శిక్షకుడు సైదయ్య, ఎన్‌ఎఫ్‌ఏలు నందకుమార్, అప్పలరాజు, మేరి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment