
న్యాయమూర్తి ప్రవళికకు సన్మానం
నరసరావుపేట టౌన్: నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రవళికను న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. మూడేళ్లుగా సివిల్ జడ్జిగా సేవలందించి ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా పిడుగురాళ్ళకు వెళ్తున్న సందర్భంగా ఈ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో 13 అదనపు జిల్లా న్యాయ అధికారి ఎన్.సత్య శ్రీ మాట్లాడుతూ.. న్యాయశాస్త్ర విద్యాభ్యాసంలో అత్యున్నత ప్రతిభ చాటి బంగారు పతకం సాధించిన ప్రవళిక వ్యక్తిగత జీవితంలో కూడా న్యాయవాదుల ఆదరాభిమానాలను చూరగొన్నారన్నారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. సీనియర్ సివిల్ న్యాయాధికారి కె. మధు స్వామి మాట్లాడుతూ న్యాయాధికారిగా అన్ని అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. న్యాయవాద సంఘ అధ్యక్షుడు మేదరమెట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అత్యంత పిన్న వయసులో న్యాయాధికారిగా నరసరావుపేటకు వచ్చి పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కరించిన ఘనత సాధించారన్నారు. కాగా ఇటీవల నరసరావుపేటలో రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన గాయత్రికి ఘనంగా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో న్యాయవాద సంఘ ఉపాధ్యక్షురాలు అమూల్య, కార్యదర్శి అబ్బూరు ఏడుకొండలు, న్యాయవాదులు కె. విజయకుమార్, బి.సలీం, ఎస్.అయ్యప్ప రాజు, సీహెచ్ ఆంజనేయులు, ఎం.సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.