జనం రారు..
రైతులు
లేరు..
పార్వతీపురం టౌన్: బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలను నియంత్రించేందుకు గతంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని పట్టణాల్లోనూ రైతు బజార్లను ఏర్పాటు చేసింది. అయితే అవి లక్ష్యానికి దూరంగా నడుస్తున్నాయి. అంతా ప్రైవేట్ వ్యాపారుల కనుసన్నల్లో దళారులే రైతుల అవతారమెత్తి కూరగాయలు అమ్ముతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉత్పత్తులను తెచ్చే రైతులు హోల్‌సేల్ వ్యాపారులు ఎంత ధర నిర్ణయిస్తే అంతకే అమ్ముకుని వెనుదిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రైతులు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు ప్రజలకు తక్కువ రేట్లకే అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన రైతు బజార్లు రోజురోజుకూ ప్రాభవం కోల్పోతున్నాయి. కొనుగోలుదారులు రావడం తగ్గిపోతుం డడంతో షాపులు ఖాళీ అవుతున్నాయి. గతంలో జిల్లాకు రెండు రైతు బజార్లను మంజూరు చేశారు. జిల్లా కేంద్రమైన పార్వతీపురం ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో, సాలూరు పట్టణంలో మామిడిపల్లి రోడ్డు వద్ద వాటిని మంజూరు చేశారు. సాలూరులో రైతుబజార్‌లో రైతులు కూరగాయలు అమ్మేందుకు సుముఖత చూపక ఇప్పటివరకు ఆ రైతు బజార్‌ను ప్రారంభించలేదు. పార్వతీపురం రైతు బజార్‌లో దళారులు సొంత రేట్లకు విక్రయాలు చేపడుతున్నారు.
పెరిగిన తోపుడు బండ్ల వ్యాపారులు
జిల్లా కేంద్రమైన పార్వతీపురంలో తోపుడు బండ్ల వ్యాపారం పెరిగింది. ఈ కాలనీ, ఆ కాలనీ అన్న తేడా లేకుండా ఉదయం సమయంలో విస్తృతంగా కూరగాయల అమ్మకాలు చేస్తున్నారు. ఇంకోవైపు రోడ్లపై చిన్నచిన్న దుకాణాల్లో కూడా కూరగాయల వ్యాపారం విస్తరించింది. దానివల్ల ఇప్పుడు పార్వతీపురం నడిబొడ్డున ఉన్న రైతుబజార్‌లో కొనుగోళ్లు తగ్గిపోయాయి. తోపుడు బండ్ల వ్యాపారుల వద్ద కూరగాయలు తాజాగా ఉండడం, ఇంటి వద్దకే వస్తుండడంతో జనం వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. రైతుబజార్లలో అమ్మకాలు తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది.
ఆటోల్లోనూ అమ్మకాలు
ఆటోల్లో కూడా కూరగాయలు తెచ్చి అమ్ముకునేవారు కూడా పెరిగిపోయారు. కొంతమంది రైతుల వద్దనే నేరుగా కొనుగోలు చేసి కాలనీల్లో అమ్మకాలు చేస్తున్నారు. కొందరు చిన్నచిన్న సెంటర్లలో రోడ్డుపై కూరగాయలు పోసి అమ్ముతున్నారు. మార్కెట్, రైతుబజార్లకంటే తక్కువ ధరకే కిలోల చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణంగా రైతు బజార్లలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా కొనుగోలు చేసేవారు. అయితే ప్రస్తుతం ఇళ్ల వద్దకే వస్తుండడంతో మహిళలు ఏ రోజుకారోజు ఆటోల వద్ద, తోపుడు బండ్ల వద్ద కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు.
రైతులు రావడం లేదు
రైతులు అమ్మకాలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. మున్సిపల్, పోలీస్‌సిబ్బంది సహాయంతో రోడ్లపై ఉన్న కూరగాయల దుకాణాలు రైతు బజార్లలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాం. వాటిని పూర్తి స్థాయిలో విస్తరించేందుకు చర్యలు తీసుకున్నాం. ఉన్నతాధికారులు కూడా అందుకోసం దిశానిర్దేశం చేశారు. కూరగాయలు పండించిన చిరు రైతులే నేరుగా రైతు బజార్లకు వచ్చి విక్రయాలు చేసేలా చర్యలు చేపడుతున్నాం.
– అశోక్ కుమార్, మార్కెటింగ్ శాఖ ఎ.డి
లక్ష్యానికి విరుద్ధంగా..
రైతులు పండించిన కూరగాయలు నేరుగా ఆయా బజార్లకు తీసుకొచ్చి విక్రయించుకోవడమే వాటి ప్రధాన లక్ష్యం. తదనుగుణంగా అప్పట్లో అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్కెట్ కంటే అక్కడ కూరగాయల ధరలు తక్కువగా ఉండడంతో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాయి. రానురాను రైతులు ఆ కేంద్రాలకు దూరమయ్యారు. కొంతమంది చిరువ్యాపారులు నేరుగా రైతులు వద్దనే కూరగాయలు కొనుగోలు చేసి రైతుబజార్‌లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఆయా రైతుబజార్లలో సగం షాపులు ఖాళీగా ఉన్నాయి. మార్కెట్‌లో మాదిరిగానే రైతుబజార్లలో ధరలు ఉండడం, మళ్లీ చిరు వ్యాపారులు వీధి వ్యాపారులకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో పార్వతీపురం రైతుబజార్‌లో ఉన్న షాపులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. రైతుబజార్‌లో 40 నుంచి 45 షాపుల వరకు ఉండగా ఏడుగురు మాత్రమే విక్రయాలు చేస్తున్నారు. అవిపోను ఖాళీగా ఉన్న మిగిలిన వాటిలో కూరగాయలకు వచ్చే బాక్సులు, సైకిళ్లు, వివిధ రకాల వస్తువులను నిల్వ చేసుకుంటున్నారు.
అలంకార ప్రాయంగా రైతుబజార్‌లు
అంతా వ్యాపారులదే రాజ్యం
రైతుల కూరగాయలు దళారులకే విక్రయం
దిష్టిబొమ్మల్లా ధరల బోర్డులు
సాధారణ మార్కెట్ మాదిరిగానే ధరలు
జిల్లాలో రెండు రైతు బజార్లు
దుకాణాలు ఉన్నా 50శాతం పైగా ఖాళీ
రైతులు లేక మూతబడ్డ సాలూరు బజార్
జనం రారు..
జనం రారు..
Comments
Please login to add a commentAdd a comment