అంగన్‌వాడీల ఆందోళన అణిచివేతకు కుట్ర..!
విజయనగరం ఫోర్ట్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సోమవారం చలో విజయవాడ కార్యక్రమాన్ని అంగన్‌వాడీలు తలపెట్టారు. అంగన్‌వాడీల ఆందోళనను అణిచివేసేందకు కూటమి ప్రభుత్వం అధికారులతో కుట్ర చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 10వతేదీన చలో విజయవాడ పేరిట ధర్నా చేస్తామని అంగన్‌వాడీలు ముందుస్తుగా ఐసీడీఎస్ సీడీపీఓలకు వినపతి పత్రం ఇచ్చారు. తీరా రేపు సమావేశం అనగా ఆందోళనకు వెళ్లొద్దని నేరుగా చెప్పకుండా ప్రతి ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ అధికారులు అంగన్‌వాడీలకు తెలియజేశారు. సమావేశానికి కచ్చితంగా ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త హాజరు కావాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ముందుగా సెలవు పెట్టిన వారి దరఖాస్తులు సైతం తిరస్కరించాలని సూపర్‌వైజర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. జిల్లాలో ఉన్న 90 సెక్టార్లలోనూ సమావేశాలు నిర్వహించనున్నారు.
యూనియన్ నాయకుల హౌస్ అరెస్టులు
అంగన్‌వాడీ యూనియన్ నాయకులు విజయవాడలో జరిగే ఆందోళనలో పాల్గొనకుండా పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేస్తున్నారు. విజయనగరంలో అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.పైడిరాజు, జిల్లా కమిటీ సభ్యురాలు తులసిలను హౌస్ అరెస్టు చేశారు.
జిల్లావ్యాప్తంగా సమావేశాలు
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సెక్టార్లలో సమావేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు అన్ని సెక్టార్లలో సమావేశాలు నిర్వహించనున్నాం.
జి.ప్రసన్న, ఇన్‌చార్జి పీడీ, ఐసీడీఎస్
Comments
Please login to add a commentAdd a comment