
నేటి నుంచి పదోతరగతి పరీక్షలు
● పార్వతీపురం మన్యం జిల్లాలో
67 పరీక్షా కేంద్రాలు
● పర్యవేక్షణకు 67 మంది
చీఫ్ సూపరింటెండెంట్లు
● అన్ని పరీక్షా కేంద్రాల వద్ద
144 సెక్షన్ అమలు
● హాల్‌టికెట్ ఉంటే బస్సులో ఉచిత ప్రయాణం
పార్వతీపురంటౌన్: పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన చీఫ్ సూపరింటెండెంట్లతో స్థానిక డీఈఒ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కేంద్రం వద్ద తాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, డెస్క్‌లు సమకూర్చడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా పర్యవేక్షణ అధికారులను నియమించామని తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇప్పటికే సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామని, మండలాల వారీగా విద్యాశాఖ అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేసి పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టామన్నారు.
’తనిఖీ బృందాల ఎంపిక..
జిల్లాలో 15 మండలాల పరిధిలో 220 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిలో 10,367 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 5,055 మంది బాలురు, 5,312 మంది బాలికలున్నారు. గత ఏడాది పరీక్ష తప్పిన 88 మంది మొత్తం 10,455 విద్యార్ధులు పరీక్షలు రాసేందుకు 67 కేంద్రాలను సిద్దం చేశారు. రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల పర్యవేక్షణకు 67 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, ఇద్దరు ఏడీఓలు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఎంపిక చేశారు. ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనునన్నారు.
సి కేటగిరీలో 22 కేంద్రాలు
జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్నట్లు 22 కేంద్రాలను గుర్తించారు. వాటిలో గతంలో చూచిరాతలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. ఈసారి అక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు చెప్పారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో సరిపడా బల్లలు లేకపోతే పక్కనున్న పాఠశాలల నుంచి తీసుకొచ్చామన్నారు. తాగునీరు, వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటాయని చెబుతూ పరీక్షల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తిచేసి, ప్రశ్నపత్రాలు పోలీసు స్టేషన్లలో భద్రపరిచామని వివరించారు.
ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
జిల్లాలో నేటి నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొకూడదనే ఉద్దేశంతో కంట్రోల్ రూమ్‌ను జిల్లా విద్యాశాఖాదికారి వారి కార్యాలయంలో నంబర్ 9063768050 ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం, పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు, ఇన్విజిలేటర్ల పనితీరు వంటి వాటిలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు సమాచారమివ్వచ్చని డీఈఓ పేర్కొన్నారు.
హాల్ టికెట్ ఉంటే బస్సులో ఉచితం
పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు పూర్తి చర్యలు చేపట్టారు. గ్రామాల నుంచి పరీక్షా కేంద్రానికి వేళ్లేందుకు హాల్‌టికెట్ ఉంటే బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే వేసులబాటు కల్పించారు. బస్సు సౌకర్యం అందుబాటులో ఉండే గ్రామాల నుంచి ఉదయం 8 గంటలకు బస్సులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు.

నేటి నుంచి పదోతరగతి పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment