ఆక్రమణలపై రెవెన్యూ కొరడా
● బొండపల్లి, కొండశంభాం
ప్రాంతాల్లో అధికారుల పరిశీలన
● ఆక్రమణలు జరిగినట్లు గుర్తింపు
● సర్వే చేసి తొలగించేందుకు
చర్యలు
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని బొండపల్లి, కొండశంభాం గ్రామాల్లో జరిగిన ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. బొండపల్లి పంచాయతీలో గల రాముల చెరువు ఆక్రమణకు గురైందని, ఆక్రమణదారులు చెరువును ఆక్రమించారని, చెరువులో నుంచి రహదారిని కూడా నిర్మించారని కొన్ని రోజుల క్రితం గరివిడి తహసీల్దార్ కార్యాలయంలో చెరువు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు తహసీల్దార్ సీహెచ్.బంగార్రాజు, ఆర్‌ఐ అచ్యుతరావుతో పాటు సర్వేయర్,స్థానిక వీఆర్‌ఓలు చెరువులో ఉన్న ఆక్రమణకు గురైన స్థలాన్ని మంగళవారం గుర్తించి ఆక్రమణలను తొలగించారు. చెరువు హద్దు ఎంతవరకు ఉందో చూపించి సరిచేయించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన కొంతమంది రైతులు చెరువులో మరోవైపు కూడా ఆక్రమణలు ఉన్నాయని, పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించాలని కోరగా రాముల చెరువు మొత్తం విస్తీర్ణాన్ని కొలతలు వేసి నివేదిక సమర్పించాలని స్థానిక వీఆర్‌ఓ, సర్వేయర్‌ను తహసీల్దార్ ఆదేశించారు. ఇరిగేషన్‌శాఖ అధికారులకు లెటర్ రాసి ఆక్రమణలో ఉన్న చెరువుగర్భాన్ని ఉపాధి హామీ పనుల ద్వారా చెరువు పరిధిలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
గెడ్డవాగులో పశువుల షెడ్డు నిర్మాణం
అదేవిధంగా కొండశంభాం పరిధిలో గల బొడ్లపేట గ్రామంలో ప్రభుత్వ గెడ్డవాగును స్థానికులు ఆక్రమించుకున్నారని తెలిసిన సమాచారం మేరకు గెడ్డవాగు ప్రాంతాన్ని పరిశీలించి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. గెడ్డవాగును మట్టితో కప్పి ఆవుల షెడ్డు నిర్మించారు. ప్రభుత్వ గెడ్డవాగు ఎంత మేరలో ఉందో సర్వే చేయించి గెడ్డవాగును ఆక్రమించిన వారికి నోటీసులు అందించి ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు.
ఆక్రమణలపై రెవెన్యూ కొరడా
Comments
Please login to add a commentAdd a comment